గుంటూరు: రాష్ట్రంలో ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ మరోమారు ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనుంది. అదే రోజు సామూహిక నిరహార దీక్షలకు దిగనుంది. ఈ ఆందోళనలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుపోవాలని, కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయించింది.
కాగా సీఎం జగన్ పాలన ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. కొత్త పాలసీని అమల్లోకి తెచ్చినా రాష్ట్రంలో ఎక్కడా ఇసుక సరిపడా దొరకడంలేదు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు ఇప్పటికే పోరాటాలు చేసిన ఫలితం లేదు. దీంతో ప్రధాన పక్షం టీడీపీ మరోమారు ఆందోళనకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని నిర్ణయించింది.