Breaking News
Home / National / ఇక ఆహారాన్ని అందించనున్న ఫ్లిప్‌కార్ట్

ఇక ఆహారాన్ని అందించనున్న ఫ్లిప్‌కార్ట్

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి దిగేందుకు రెడీ అవుతోంది. ‘ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కొత్త సంస్థను రిజిస్టర్ చేసినట్టు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సంస్థ ద్వారా స్థానిక ఉత్పత్తులతోపాటు ప్యాకేజ్‌డ్ ఫుడ్‌ను నేరుగా వినియోగదారులకు అందించనుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా వీటిని విక్రయించనుంది. స్థానిక చట్టాలకు అనుగుణంగానే వ్యాపారం చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ వ్యాపారం కోసం ఫ్లిప్‌కార్ట్ రూ.1,845కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.

కొత్త వ్యాపారం కోసం ఇప్పటికే వేలాదిమంది రైతులను సంప్రదించినట్టు కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. వారందరితో కలిసి పనిచేస్తామన్నారు. దేశంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవోస్), ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఎంతోమంది రైతులకు ఆదాయాన్ని ఇస్తున్నాయని, అలాగే నాణ్యమైన ఆహారాన్ని అతి తక్కువ ధరకే లక్షలాదిమందికి అందిస్తున్నాయని ఆయన వివరించారు.

ఫ్లిప్‌కార్ట్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన అమెజాన్ ఇటీవల తన ఫుడ్ రిటైల్ బిజినెస్‌ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఫ్లిప్‌కార్ట్ తాజా ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో 500 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు అమెజాన్ ఇటీవల పేర్కొంది. కాగా, ఆమెజాన్ ఇండియా ఇప్పటికే అమెజాన్ నౌ, అమెజాన్ ప్రైమ్, అమెజాన్ ఫ్రెష్ వంటి వ్యాపారాలను ప్రారంభించింది. ఈ-కామర్స్ సంస్థలు ఆహార పదార్థాలను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు భారతీయ చట్టాలు అనుమతిస్తున్నాయి. ఇతర ఉత్పత్తులను మాత్రం థర్డ్‌పార్టీ సెల్లర్స్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *