కృష్ణా/తోట్లవల్లూరు : కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. కృష్ణానదీపాయలకు వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ నుంచి 5.70 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయటంతో పాయలన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. వరద అన్నదాతలను బెంబేలెత్తిస్తోంది. ఆగస్టు 13న సంభవించిన వరద పంటలన్నింటినీ నాశనం చేసింది. ఆ నష్టాల నుంచి ఇంకా రైతులు తేరుకోలేదు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత మినుము విత్తనాలను వేయగా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. కొందరు మొక్కజొన్న, కూరగాయల పంటలను, పూల తోటలను కొత్తగా సాగు చేపట్టారు. మళ్లీ వరద రావటంతో లంక రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
