హైదరాబాద్: ప్రజా రవాణా వ్యవస్థను బ్రతికించుకోవడం కోసమే తాము సమ్మె చేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆర్టీసీలో దాదాపు 2500 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సకల జనుల సమరభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. నీళ్ళు, నిధులు, నియామకాలు అందని ఏకైక సంస్థ ఆర్టీసీయేనని పేర్కొన్నారు. కొందరు నాయకులు రాజకీయ స్వార్థం కోసం రాజీ పడుతున్నారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. సకల జనుల సమరభేరికి టీడీపీ నేత ఎల్ రమణ, కాంగ్రెస్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు.
