విజయవాడ: విజయవాడలో మాజీ ఎంపీ, తెదేపా సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలన జనరంజకంగా సాగుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ట్రావెల్స్ ఉన్నా సీఎం జగన్‌కు తన బస్సులే కనిపిస్తున్నాయని మండిపడుతూ ఇందుకు సంబంధించి ఆయన పాలనకు 100కి 150మార్కులు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు తనకు సంబంధించిన 31బస్సులను సీజ్ చేశారని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. 70ఏళ్ల నుంచి వాహనరంగంలో ఉన్నామని, చిన్న చిన్న లోటు పాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్‌లో అయినా సహజమేనని అన్నారు. ఫైన్లతో పోయే తప్పిదాలకు బస్సులను సీజ్ చేయటం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మా అబ్బాయే అని, కానీ అతడు పరిపాలనలో కిందా మీద పడుతున్నాడని ఎద్దేవాచేశారు.
