Breaking News
Home / Lifestyle / Business / లాభం నుంచి నష్టంలోకి

లాభం నుంచి నష్టంలోకి

మార్కెట్‌ను వెంటాడిన బడ్జెట్‌ భయాలు
స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నాలుగో రోజూ మదుపరులను నిరాశ పరిచింది. ఉదయం 200 పాయింట్ల లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌, ఒక దశలో 359 పాయింట్ల వరకూ పెరిగింది. చివరికి 1.25 పాయింట్ల నష్టంతో 35,591.25 దగ్గర క్లోజైంది. నిఫ్టీ కూడా 0.40 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,651.80 దగ్గర ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధిక వెయిటేజి ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌ కంపెనీల షేర్లు ఐదు శాతానికిపైగా పెరగడంతో, సూచీలు పెద్దగా పతనం కాకుండా బయటపడ్డాయి. లేకపోతే నష్టం మరింత ఎక్కువగా ఉండేది.

పతనానికి కారణాలు
శుక్రవారం నాడు ప్రకటించే కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉంటుందోనన్న భయాలు బుధవారంనాడు కూడా మార్కెట్‌ను ప్రధానంగా వెంటాడాయి. గురువారం నాటి జనవరి నెల డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ ముగింపు ఎలా ఉంటుందోనన్న భయాలూ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. వడ్డీ రేట్లపై బుధవారం రాత్రి అమెరికా కేంద్ర బ్యాంక్‌ ‘ఫెడరల్‌ రిజర్వు’ ఏ నిర్ణయం ప్రకటిస్తుందోనన్న భయం కూడా మార్కెట్‌ను వెంటాడింది. వాణిజ్య యు ద్ధానికి తెరదించేందుకు అమెరికా-చైనా మధ్య ప్రారంభమైన చర్చలపైనా మార్కెట్‌ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడమూ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఫార్మా కంపెనీల షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్‌, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు మాత్రమే లాభాలతో ట్రేడయ్యాయి.

లాభాల్లో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు
యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు బుధవారం చురుగ్గా ట్రేడయ్యాయి. బీఎస్‌ఈలో ఒక దశలో ఈ షేర్లు 6.38 శాతం దూసుకు పోయాయి. చివరికి 4.56 శాతం లాభంతో రూ.690.90 దగ్గర ముగిశాయి. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ బుధవారం ఒక్క రోజే రూ.7,744.81 కోట్లు పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరింది.

పుంజుకున్న డిష్‌ టీవీ షేర్లు
జీ గ్రూపునకు చెందిన డిష్‌ టీవీ షేర్లు బుధవారం మరింత పుంజుకున్నాయి. బీఎ్‌సఈలో ఈ కంపెనీ షేర్లు 10.55 శాతం లాభంతో రూ.24,10 దగ్గర ముగిశాయి.

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లలో ఆగని పతనం
కోబ్రా పోస్ట్‌ కథనంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు బుధవారమూ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు 10 శాతం నష్టపోయి రూ.154కి చేరి 35 నెలల కనిష్ఠ స్థాయిని తాకాయి. చివరికి 4.97 శాతం నష్టంతో రూ.161.60 దగ్గర ముగిశాయి. దీంతో గత మూడు రోజుల్లోనే ఈ షేర్లలో మదుపరులు 23 శాతం వరకు నష్టపోయారు.

Check Also

పసిడికి కళ

Share this on WhatsAppమళ్లీ మదుపర్లను ఆకర్షిస్తున్న బంగారం అంతర్జాతీయ పరిణామాలే కారణం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *