ఫిల్మ్ న్యూస్: దీపావళి అనగానే కోలీవుడ్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంది. పండుగ రోజున విడుదలయ్యే సినిమాల కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది దీపావళికి ఇళయ దళపతి విజయ్ ‘బిగిల్’ విడుదల చేయనున్నట్టు షూటింగ్ ప్రారంభంలోనే నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఆ తరువాత కార్తీ ‘ఖైదీ’, విజయ్ సేతుపతి ‘సంగతమిళన్’, తమన్నా ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘పెట్రోమాక్స్’ చిత్రాలు కూడా దీపావళికి విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో 2019 దీపావళికి భారీ పోటీ తప్పదని భావించారు. అయితే అనూహ్యంగా ‘సంగతమిళన్’, ‘పెట్రోమాక్స్’ చిత్రాలు దీపావళి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ మొదటివారంలోనే ‘సంగతమిళన్’ను విడుదల చేయాలనుకుంటున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. అక్టోబర్ 4న ధనుష్ ‘అసురన్’తో పాటు ‘సంగతమిళన్’ విడుదలయ్యే ఛాన్స్ వుంది. అలాగే ‘పెట్రోమాక్స్’ను అక్టోబర్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిని బట్టి దీపావళికి ‘బిగిల్’, ‘ఖైదీ’ మాత్రమే రేసులో నిలువనున్నాయి.
