ఢిల్లీ: వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండే, కనిపించే మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు ఓ బ్యాంకుపై చిర్రెత్తుకొచ్చింది. ట్విట్టర్ వేదికగా ఆ బ్యాంకుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. లక్ష్మణ్ కోపానికి కారణమైన ఆ బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంకు. ఈ బ్యాంక్ సేవలు, కస్టమర్ కేర్ పనితీరుపై లక్ష్మణ్ తన ఆవేదనను వ్యక్తంచేస్తూ బ్యాంకు సేవలతో తాను చాలా నిరాశ చెందానని చెప్పాడు. ఆ బ్యాంకు సిబ్బంది వచ్చి తమ బ్యాంకులో ఖాతాను ప్రారంభించాలని, అన్ని రకాల సేవలను అందిస్తామని వాగ్దానం చేస్తారు కానీ వారికి బ్యాంకింగ్ కు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు కూడా తెలియవని మండిపడ్డారు. వాస్తవానికి ఏం జరిగిందో ఆయన వెల్లడించనప్పటికీ బ్యాంకు తీరుతో ఆయన చాలా విసిగిపోయారనే విషయం మాత్రం అర్థమవుతోంది. లక్ష్మణ్ వ్యాఖ్యలపై ఇక బ్యాంకు యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
