హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరగనున్న ‘గ్లోబల్ బయో ఇండియా రోడ్‌షో – 2019’కి సర్వం సిద్ధమైంది. నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లో రోడ్ షోకు ఏర్పాట్లు చేశారు. ‘బయో – నెస్ట్ ఆఫ్ ఎ ఐడియా’, ‘టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ఆఫ్ ఎన్‌ఏఏఆర్‌ఎం’, ‘అగ్రీ బయోటెక్ ఫౌండేషన్’ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రోడ్ షో శుక్రవారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరగనుంది. దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్న బయోటెక్నాలజీ రంగాన్ని మరింత పరిపుష్టం చేసే ఉద్దేశంతో గ్లోబల్ బయో ఇండియా – 2019 సదస్సును కేంద్రప్రభుత్వం నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలో ఉన్న ఏరోసిటీలో నవంబర్ 21 – 23 వరకు ఈ సదస్సు జరగనుంది. బయో ఫార్మా, బయో ఇండస్ట్రియల్, బయో ఎనర్జీ, బయో సర్వీసెస్ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సుపై అవగాహన కల్పించడంలో భాగంగా రోడ్ షో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, విద్యార్థులు, స్టార్టప్స్‌కు చెందినవారు, ప్రభుత్వ అధికారులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.
