Breaking News
Home / Lifestyle / Business / పసిడికి కళ

పసిడికి కళ

మళ్లీ మదుపర్లను ఆకర్షిస్తున్న బంగారం
అంతర్జాతీయ పరిణామాలే కారణం
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించడంతో మదుపరుల దృష్టి మరోసారి బంగారంపై పడింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి నెలకొంది. జనవరిలో లాభాల బాటలో పయనించిన ఔన్సు ధర 1,321.21 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం ధర పెరగడం వరుసగా ఇది నాలుగో నెల. ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధిరేటు మందగించింది. ఈక్విటీ మార్కెట్లు గత ఏడాది కాలంగా తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. దీనికి తోడు వడ్డీరేట్ల పెంపునకు అమెరికన్‌ ఫెడరల్‌ విరామం ఇవ్వడం, డాలర్‌ బలహీనత, అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అస్థిరతలు… ఇవన్నీ బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలేవీ లేకపోవడం, అమెరికాలో ఏర్పడిన షట్‌డౌన్‌ డాలర్‌ రేటును ప్రభావితం చేశాయి. అమెరికన్‌ ఫెడరల్‌ దూకుడు తగ్గించడం తప్పనిసరి అని మార్కెట్‌ వర్గాలు ఒక నిశ్చయానికిరావడంతో సెంటిమెంట్‌ బలహీనపడింది.

2018 సంవత్సరం అంతా అమెరికన్‌ ఫెడరల్‌ వడ్డీరేట్లు పెంచుతూనే వచ్చింది. వరుసగా తొమ్మిది సార్లు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీకి అవరోధం ఏర్పడింది. 2019 సంవత్సరంలో ఇదే ధోరణి అనుసరిస్తే మరింత రిస్క్‌ తప్పదన్న సంకేతాలు కూడా అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌ వడ్డీరేట్ల పెంపు క్రమానికి విరామం ఇవ్వడానికి కారణం. ఈ స్థూల ఆర్థిక పరిస్థితులన్నీ భవిష్యత్తులో బంగారం ధరలు మరింతగా పెరుగుతాయనేందుకు సంకేతాలని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరతలు పెరిగిపోయిన వాతావరణంలో పెట్టుబడుల్లో సమతూకం తెచ్చి పోర్ట్‌ఫోలియోలో రిస్క్‌ను తగ్గించే సాధనం బంగారం ఒక్కటేనని వారు చెబుతున్నారు.

2019.. బులియన్‌ ఏడాది : కార్వీ
2019 సంవత్సరాన్ని బులియన్‌ ఏడాదిగా పరిగణించవచ్చని హైదరాబాద్‌కు చెందిన కార్వీ కన్సల్టెంట్స్‌ తెలిపింది. కార్వీ సంస్థ కరెన్సీ, కమోడిటీ మార్కెట్లపై నివేదికను వెలువరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం, వెండి ఇతర పెట్టుబడి సాధనాల కన్నా మెరుగైన రాబడులు అందించే ఆస్కారం ఉన్నదని కార్వీ సీఈఓ (కమోడిటీస్‌, కరెన్సీస్‌) రమేశ్‌ వరఖేడ్కర్‌ తెలిపారు. కమోడిటీ, కరెన్సీ మార్కెట్లు రెండింటికీ 2018 అత్యంత చేటు కలిగించిన సంవత్సరం అని కార్వీ ఆ నివేదికలో పేర్కొన్నారు. 2017 సంవత్సరంలో ఈ రెండు మార్కెట్లు చూపిన అద్భుతమైన పురోగతిని 2018లో కొనసాగించలేకపోయాయని వివరించింది.

Check Also

స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా ఐదో రోజూ లాభాలు జోరు

Share this on WhatsApp5 నెలల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లిన సూచీలు ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా ఐదో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *