బెంగళూరు: కొన్నేళ్లకాలంగా ప్రేమలో గడిపి పెళ్లి చేసుకున్న రోజునే భార్యను దారుణంగా హతమార్చాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మైసూరు జిల్లా పెరియ పట్టణ తాలూకా లక్ష్మీపుర గ్రామానికి చెందిన నాగమ్మ(19)తో పవన్‌కు గురువారం వివాహమైంది. అయితే అదే రోజు రాత్రే అతడు ఆమెను హత్య చేశాడు. పవన్, నాగమ్మ పదో తరగతి హుణసూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలిసి చదివారు. అప్పటి నుంచి ఇరువురూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగడంతో నాగమ్మ గర్భిణి అయ్యారు. ఆ తర్వాత పెళ్లికి పవన్ నిరాకరించడంతో గ్రామ పెద్దలు పంచాయితీ చేసి ఒప్పించారు. ఇలా గురువారం ఉదయం వారు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో నాగమ్మపై కక్ష పెంచుకున్న పవన్ ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా అదే రోజు రాత్రి ఆమెను గ్రామ సమీపంలోని కొండప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ రాడ్‌తో తలపై మోదాడు. అలాగే గొంతుకు బట్ట బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడే పూడ్చి పెట్టాడు. పవన్ తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు పెరియపట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేయగా నాగమ్మ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం వారు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు.
