Breaking News
Home / States / పేగు బంధమే కాదు.. కాలేయ బంధంతో తన బిడ్డకు సంపూర్ణ ఆయుష్షు

పేగు బంధమే కాదు.. కాలేయ బంధంతో తన బిడ్డకు సంపూర్ణ ఆయుష్షు

తన కాలేయంతో బిడ్డను కాపాడుకున్న తల్లి
గ్లోబల్‌ ఆస్పత్రిలో అయిదున్నర నెలల పాపకు కాలేయ మార్పిడి
హైదరాబాద్‌ సిటీ: తల్లికి ప్రసవం పునర్జన్మ.. తన ప్రాణాలను పణంగా పెట్టి జన్మనిస్తుంది. కానీ.. ఆ తల్లి తన బిడ్డకు జన్మనే కాదు.. పునర్జన్మను కూడా ఇచ్చింది. పేగు బంధమే కాదు.. కాలేయ బంధంతో తన బిడ్డకు సంపూర్ణ ఆయుష్షు పోసింది. పుట్టిన వారం రోజులకే ఆ చిన్నారికి కాలేయ సంబంధిత జబ్బు చేసింది. కాలేయ మార్పిడి అవసరం కావడంతో తల్లే ముందుకొచ్చింది. తన కాలేయాన్ని ఇచ్చి బిడ్డకు పునర్జన్మనిచ్చింది. నెల క్రితం అయిదున్నర నెల శిశువుకు గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడీని విజయవంతంగా నిర్వహించారు. కాలేయ మార్పిడి వివరాలను ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ఎండి రవీంద్రనాథ్‌, వైద్యులు వేణుగోపాల్‌, బల్బీర్‌సింగ్‌, ప్రశాంత బంచన్‌, మోహన్‌ తదితరులు వివరించారు.

అయిదున్నర నెలలకే..
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నర్సింగ్‌రావు, మమత దంపతులు నివసిస్తున్నారు. గత ఏడాది జూలై 18న ఆడ శిశువు పుట్టింది. ఈ పాపకు మైథిలీ అని పేరుపెట్టారు. ఈ చిన్నారి పుట్టిన వారం రోజుల నుంచే ఫిట్స్‌ రావడం, నిద్రమత్తులో ఉండడం, శరీరం నీలం రంగుగా మారడం వంటి సమస్యలు వచ్చాయి. వైద్యులకు చూపించగా ఆర్గానిక్‌ యాసిడేమియా అనే ఒక రకమైన సమస్యతో ‘మ్యాపిల్‌ సిరప్‌ యూరిన్‌ డిసీజ్‌ (ఎంఎస్ యూడీ)తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇది జన్యుపరమైనది. ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసి పరిశీలించగా పాప శరీరంలో అమైనో యాసిడ్స్‌ శాతం పెరుగుతుండడం వల్ల దీని ప్రభావం మెదడుపై పడి కాలేయ సంబంధిత జబ్బుగా మారిందని తెలుసుకున్నారు.

బ్రాంచ్‌ అమైనో యాసిడ్స్‌గా పేర్కొనే కొన్ని అమైనో ఆమ్లాలు జీవనక్రియలకు, పిల్ల నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతాయని, తద్వారా పాపకు ఆమ్లాలు జీర్ణం కాలేకపోవడం వల్ల టాక్సిన్స్‌ (విషపదార్థాలు) పెరుగుతాయని వైద్యులు వివరించారు. దీని ప్రభావంతో పాప మూత్రం మ్యాపిల్‌ సిర్‌పగా మారి మరిగించిన వాసన రావడం మొదలైంది. ఇది మైథిలి కాలేయ పనితీరుపై పడింది. పాప ఆహారం కోసం పాల పౌడర్‌ను బెంగళూరు నుంచి తెప్పించి ఇస్తున్నారు. అయితే ఆహారం కూడా తీసుకోలేకపోవడంతో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపింది. ఈ సమస్యను మందులతో నియంత్రించలేనిదిగా వైద్యులు నిర్ధారించి కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మేనరికం వల్లనే..
ఈ బిడ్డకు ఎంఎస్‌యూడీ జబ్బు రావడానికి జన్యుపరమైనదిగా వైద్యులు గుర్తించారు. ఇది మేనరిక వివాహం వల్ల వస్తుందని, నర్సింగ్‌రావు మమతలది మేనరిక సంబంధమని వైద్యులు చెప్పారు. రెండు లక్షల మంది పిల్లల్లో ఒకరికి ఈ తరహా జన్యుపరమైన జబ్బు వస్తుందని చెప్పారు. గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో ఈ ఏడాదిలో 12 మంది పిల్లలకు కాలేయ మార్పిడి నిర్వహించామని, అందులో అందరు 10కిలోల లోపు ఉన్నావారేనని ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ చెప్పారు. 2003 నుంచి ఇప్పటీ వరకు 20 మంది పిల్లలకు కాలేయ మార్పిడి నిర్వహించామని ఆయన వివరించారు.

తల్లి కాలేయ పరిమాణాన్ని తగ్గించి..
ఈ చిన్నారికి కాలేయం మార్పిడి చేసేందుకు దాత కోసం ప్రయత్నించారు. తనబిడ్డకు తన కాలేయాన్నే తీసుకొమ్మని ఆ మాతృమూర్తి ముందుకొచ్చింది. తల్లి కాలేయాన్ని వైద్యులు పరిశీలించి మార్పిడి చేయడానికి సరిపోతుందనే నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా పెద్దలకు కాలేయం కుడి భాగం తీసి అమరుస్తారు. కానీ పిల్లలకు ఎడమవైపు భాగాన్ని తీసి అమరుస్తామని వైద్యులు వేణు, బల్బీర్‌సింగ్‌ వివరించారు. మైథిలి కేవలం అయిదున్నర నెలలే ఉండడంతో అవయవాలు చిన్నగా ఉన్నాయి. శరీర ఉదర పరిమాణం, రక్తనాళాలు, ఇతర నాళాలు, ప్రస్తుతమున్న కాలేయ పరిమాణం చాలా చిన్నగా ఉంది. దీంతో 20 నుంచి 25 శాతం కాలేయాన్ని తల్లి నుంచి సేకరించారు. శస్త్రచికిత్సతో పదిశాతం పరిమాణం వరకు మాత్రమే కాలేయాన్ని సరిదిద్ది ఒకభాగం బిడ్డకు కాలేయ మార్పిడి చేసి అమర్చారు. మార్పిడీ పక్రియ నిర్వహించడానికి దాదాపు పది గంటల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తరువాత మైథిలి బాగా కోలుకుందని, కాలేయం బాగా పనిచేస్తోందన్నారు. అమైనో యాసిడ్స్‌ స్థాయి కూడా తగ్గిపోయిందని, ఫిట్స్‌ ఆగిపోయాయని తెలిపారు. నోటి ద్వారా కూడా ఆహారం తీసుకుంటోందని, పాప ఎదుగుదలలో మున్ముందు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని వైద్యులు వెల్లడించారు.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *