మరో 24 గంటలు వర్షాలు..
విశాఖపట్నం, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ఏపీ తీరం వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం మధ్యాహ్నానికి కాకినాడ-విశాఖ మధ్య తీరానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 14 సెంటీమీటర్లు, విశాఖ జిల్లా ఎలమంచిలిలో 13, తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో 13, విశాఖ జిల్లా భీమిలిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
