Breaking News
Home / Crime / హీరా గ్రూపు దందాలో తెరవెనుక పెద్దలు ఎవరు?

హీరా గ్రూపు దందాలో తెరవెనుక పెద్దలు ఎవరు?

వేలకోట్ల రూపాయల స్కీములతో దేశ విదేశాల్లో ముస్లిం మతస్తులను దోచేసిన హీరా గ్రూపు నిర్వాహకురాలు నౌహీరాషేక్ తెరముందు కన్పించే బొమ్మేనా? హీరా గ్రూపును తెర వెనుక ఆడిస్తున్నదెవరు? హీరా గ్రూపు ద్వారా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వసూలు చేసిన వేలకోట్ల డబ్బు.. గల్ఫ్‌ దేశాల్లోని ఉద్యోగులను మోసగించిన సొమ్ము ఏ విధంగా దేశం దాటింది ? హీరా గ్రూపు న్యాయవాది వినీత్ దండా విదేశీ కంపెనీలోకి నిధులెక్కడి నుంచి వెళ్లాయి? హీరా గ్రూపు అక్రమాలపై విజిల్ బ్లోయర్లు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నా కట్టడి చేయకుండా నిండామునిగే దశలో నౌహీరాషేక్‌ను అరెస్టు చేయడం వ్యూహత్మకమేనా.. పోలీసు పెద్దల అండదండలు నౌహీరాషేక్‌కు ఏ విధంగా సాయం చేశాయనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

కేవలం ఒక మతం వారిని టార్గెట్ చేసి వేలకోట్ల రూపాయలు వసూలు చేసిన హీరా గ్రూపు నిర్వాహకురాలు నౌహీరా షేక్‌ తెరమీద కన్పించే పాత్ర మాత్రమేననే అనుమానాలు మిన్నంటుతున్నాయి. నౌహీరాషేక్‌పై ఆరోపణలు వచ్చిన తొలిదశలో కేంద్ర దర్యాప్తు సంస్ధలు కానీ, రాష్ట్రంలోని పోలీసులు కానీ చురుకుగా వ్యవహరించి ఉంటే ఈ స్ధాయిలో మోసం జరిగి ఉండేది కాదు. హీరా గ్రూపు లావాదేవీలకు సంబంధించిన కీలకమైన హార్డ్‌డిస్క్ మాయమైందనే విషయం ప్రస్తుతం పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ పోలీసులు నౌహీరాపై హీరా గ్రూపు మోసానికి సంబంధించి తొలి కేసు నమోదైన వెంటనే అరెస్టు చేయకుండా ఆమెకు టైమ్ ఇవ్వడంతో రికార్డులు మాయమయ్యాయి. దాదాపు 1500 కోట్ల రూపాయల డబ్బు దేశందాటి వెళ్లిందనే విషయం బయటకు పొక్కడంతో కేసు దర్యాప్తు అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హీరా గ్రూపు మోసం తీవ్రతను అంచనా వేయడంలో హైదరాబాద్ పోలీసుల విఫలం అవడం లేదా పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గడంతోనే డబ్బు దేశం దాటిపోయిందని బాధితులు వాపోతున్నారు.

నౌహీరాషేక్ సోదరుడు ఇస్మాయిల్ షేక్ ఈ కంపెనీలో ఒక డైరక్టర్. హీరా గ్రూపు కంపెనీల మీద బంజారాహిల్స్, కూకట్‌పల్లి పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన వెంటనే బాధితులకు డబ్బు ఇప్పించి వారి నోళ్లు మూయించడానికి కొందరు పెద్దలు రంగంలో దిగారు. అదే సమయంలో పోలీసులు నౌహీరా, ఇతర డైరెక్టర్లను కట్టడి చేయాలన్న విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించడంతో ఇస్మాయిల్ షేక్ దేశం దాటి ఆఫ్రికాకు పారిపోయాడు. ఇతను దాదాపు వెయ్యికోట్ల రూపాయల వరకు దేశం దాటించాడని సమాచారం. ఇదే పంథాలో నౌహీరా బినామీ అయిన ఖాజా నయీముద్దీన్ సైతం ఆమె అరెస్టు తర్వాత దాదాపు 500కోట్ల రూపాయలను దేశం దాటించి ప్రస్తుతం దుబాయ్‌లో తలదాచుకున్నాడని పోలీసువర్గాలకు సమాచారం అందింది.

ఇక, నౌహీరా షేక్ తరఫున గల్ఫ్‌ దేశాల్లో చక్రం తిప్పుతున్న అర్షద్ బషీర్ మదాని పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతో గత నెలలో దేశం దాటి టోరెంటో పారిపోయినట్లు సమాచారం. ఇతను పెద్ద మొత్తంలోడబ్బు దేశం దాటించాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నౌహీరా షేక్ అరెస్టు తర్వాత బినామీలు, ఇతర డైరెక్టర్లపై దృష్టిసారించాల్సిన పోలీసు యంత్రాంగం కొందరు పెద్దల ఒత్తడితో నిస్సహాయస్ధితికి చేరడంతో వీరంతా దేశం వదిలి పారిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు.

నౌహీరాను ఢిల్లీ వెళ్లి అరెస్టు చేసి తీసుకుని వచ్చిన హైదరాబాద్ పోలీసులు.. దాదాపు 160 బ్యాంకు ఖాతాలు ఆమె ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. వాస్తవానికి కేసు నమోదు అయిన తర్వాత అరెస్టుకు దాదాపు మూడునెలలు సమయం పట్టడంతో ఈలోపు ఆ ఖాతాల్లోని సొమ్ము ఖాళీ అయ్యింది. 160 ఖాతాల్లో కూడా అత్యధికం ఇండస్ ఇండ్ బ్యాంకు శాఖల్లో ఉన్నాయి. ఈ ఖాతాల్లో విచిత్రాలు బయటపడుతుండటంతో దర్యాప్తు అధికారులు ప్రస్తుతం తలపట్టుకున్నారు. చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద నౌహీరా షేక్ బ్యాంకు లావాదేవీలు నిర్వహించడం ఆమె చతురతకు.. బ్యాంకు అధికారుల లాలూచీ వ్యవహారాలకు పరాకాష్టగా నిలుస్తోందని ఈ కేసులో వేలుపెట్టిన ఇన్‌కంటాక్స్ అధికారులు గుర్తించారు.

నౌహీరా షేక్ తరపున కేసును వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ దండా హఠాత్తుగా ఆమె కేసుల నుంచి తప్పుకోవటం వెనుక ఓ పెద్ద కథే వెలుగులోకి వచ్చింది. వినీత్ దండా ఆయన భార్య పూనీత్‌కౌర్ దండాలు గత ఏడాది లండన్‌లో వీర్ స్వరాజ్య్ లిమిటెడ్‌ అనే కంపెనీని ప్రారంభించారు. ఇంగ్లాడ్‌లో వేల్స్ రాష్ట్రంలో ఈ కంపెనీని గత ఏడాది జూన్ 26న రిజిస్టర్‌ చేశారు. న్యాయవాదిగా ఉన్న వినీత్ దండా వ్యాపారాలు చేయడం చట్ట వ్యతిరేకం. అసలు ఈ కంపెనీలోకి డబ్బు ఏవిధంగా వచ్చింది. ఎవరి ఖాతాలోకి చేరిందనే విషయంలో నౌహీరా షేక్ పేరు తెర మీదకు వచ్చింది. నౌహీరా షేక్ కంపెనీల నుండి వీర్ స్వరాజ్య్ ఖాతాలకి డబ్బులు మళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో నౌహీరా షేక్ కేసు తనమీద పడుతుందేమోనని వినీత్‌ దండా కేసు నుండి తప్పుకున్నాడని చెబుతున్నారు. పై పైకి కేసు నుండి తప్పుకుంటున్నట్లు తెలిపిన వినీత్ దండా.. తెర చాటున న్యాయపరమైన సలహాలు అందిస్తున్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనికి సంబంధించిన కీలక పత్రాలు ఏబీఎన్ చేతికి చిక్కాయి.

తెలంగాణలోని ఓ బడా రాజకీయ నేత గతంలో పలుమార్లు నౌహీరాకు అండగా నిలబడి దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. నౌహీరా షేక్ విషయం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో తమ దందా ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో.. ఆ పెద్దమనిషి ప్రభుత్వం పెద్దల సహకారంతో కొత్తగా కేసులు నమోదు కాకుండా అడ్డుపడుతున్నట్లు బాధితులు భావిస్తున్నారు. నౌహీరా షేక్‌తో బడారాజకీయ నేత కుమారుడు ఓ ట్రస్టు పేరిట సాగించిన దందాకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏబీఎన్ చేతిలో ఉన్నాయి.

హీరా గ్రూప్ మోసం బయటపడ్డప్పటికి నౌహీరాకు తెర వెనుక సహాయం చేస్తున్న పెద్దల పాత్రలు ఇంకా పూర్తిగా వెలుగు చూడలేదు. ఆమెను తెరపై బొమ్మలా ఆడిస్తూ వెనుక చక్రం తిప్పుతున్న బడాబాబును బయటకు లాగే సాహసం పోలీసులు చేయగలుగుతారా లేదా అన్నదే ప్రస్తుతం సందేహాస్పదంగా వుంది.

నౌహీరా షేక్ వెనుక వున్న పెద్దలు బయటకు రాకుండా వుండాలంటే ఆమెను భౌతికంగా అంతం చేయడానికి కూడా వెనుకాడరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హైదరాబాద్‌లో జరిగిన చార్మినార్ బ్యాంక్ చైర్మన్.. సజ్జాద్ ఆగా.. ఆత్మహత్య లాగానే ఈ కేసుకి ముగింపు పలకాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Check Also

ఎంజీ హెక్టార్ కారు విడుదల

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మరో కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *