Breaking News
Home / States / ఆకలి తీరుస్తున్న ‘హైదరాబాద్‌ బాయ్స్‌’

ఆకలి తీరుస్తున్న ‘హైదరాబాద్‌ బాయ్స్‌’

హైదరాబాద్‌: సేవాభావమే వారందర్నీ ఒకచోటకు చేర్చింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కరవై.. చాలామందికి పూట గడవడమే కష్టంగా మారింది. ఈ క్రమంలో అన్నార్తులకు అండగా 40 రోజులుగా కలిసికట్టుగా సాగుతున్నారు సత్యసాయి సేవా సమితికి చెందిన ‘హైదరాబాద్‌ బాయ్స్‌’ బృందం. బోయిన్‌పల్లి శోభా గార్డెన్స్‌లోని నిత్యం 8 వేల వరకు ఆహార ప్యాకెట్లు తయారు చేసి జీహెచ్‌ఎంసీ, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా అభాగ్యులకు అందిస్తున్నారు.

మూడు వందలతో మొదలై..
రోజుకు కనీసం ఒక పూటైనా పేదల ఆకలి తీర్చాలని సత్యసాయి సేవా సమితి ఏప్రిల్‌ 13వ తేదీన 300 ఆహార పొట్లాలను తయారు చేసి పంపిణీ ప్రారంభించారు. మూడు రోజుల్లోనే ఆ సంఖ్య 6వేలకు పెరిగింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఏ రోజు ఎంతమందికి అవసరం అని జీహెచ్‌ఎంసీ, పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఆ మేరకు రెండు పూటలా రుచికరమైన ఆహారం సిద్ధం చేయడంలో దాదాపు 40 మంది సేవాదళ్‌ సభ్యులు నిమగ్నమవుతున్నారు. వీరిలో అధ్యాపకులు, పరిశోధకులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వ్యాపారస్థులు, విశ్రాంత సైనికాధికారులు ఉన్నారు. వీరిలో కొంతమంది నెలరోజులుగా తయారీ కేంద్రంలోనే ఉంటున్నారు.

నెలాఖరు వరకు..
ఎప్పటికప్పుడు మెనూ మారుస్తూ.. పంపిణీ చేసే ఆహారాన్నే సేవాదళ్‌ సభ్యులూ తింటున్నారు. శుక్రవారం తయారు చేసిన 7,800 ఆహార పొట్లాల్లో 2,500 వలస కూలీలకు అందించారు. ‘ఇప్పటివరకు 2.42 లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేశాం. ఇందుకు అవసరమైన నిధులను మేమే సమకూర్చుకున్నాం. వంట చేసుకునేందుకు శోభా గార్డెన్స్‌ను యాజమాని శాంతారామ్‌ ఉచితంగా ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తాం’ అని హైదరాబాద్‌ బాయ్స్‌కు నేతృత్వం వహిస్తున్న ఉదయ్‌భాస్కరరెడ్డి తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *