Breaking News
Home / Crime / చదువు డల్‌.. మోసాలు ఫుల్‌

చదువు డల్‌.. మోసాలు ఫుల్‌

చదువు డల్‌.. మోసాలు ఫుల్‌
ఈజీ మనీపై ఆశ
కొత్తరకం మోసాలకు తెర
మాటల గారడీతోనే వ్యవహారం అంతా
వ్యసనాలతో పతనం
హైదరాబాద్‌: చదువు అంతంత మాత్రమే… కానీ బహుబాషా కోవిదులు. టెక్నాలజీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను మించిపోతారు. ప్రైవేట్‌ కంపెనీల్లో చిన్న ఉద్యోగానికి కూడా అర్హత లేకపోయినా విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటారు. స్థానిక భాషలో దరఖాస్తు ఫారం పూర్తి చేయడం రాకపోయినా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతం వారికున్న భాషా పరిజ్ఞానానికి ముగ్దులవుతారు. ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలైనా సరే వారి మాటల గారడీకి పడిపోవాల్సిందే. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? ఇంకెవరు రకరకాల స్కీమ్‌లతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్ల గురించి. ప్రస్తుతం రోజుకు రెండుమూడు సైబర్‌ నేరాలు వెలుగు చూస్తున్నాయి. పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రకరకాల స్కీమ్‌లతో వందలమంది మోసపోతున్నారు. పోలీసులు సైబర్‌ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెడుతున్నా ప్రజలకు సైబర్‌ నేరాలపట్ల అవగాహన రావడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త తరహాలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

వారిని పట్టుకొని విచారించినప్పుడు అవాక్కయ్యే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. 80 శాతం నేరగాళ్లు కేవలం, పది, ఇంటర్‌ చదువు కూడా పూర్తి చేయని వారే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ కేటుగాళ్లు కేవలం తమకున్న భాషా, పరిజ్ఞానం, టెక్నాలజీపై ఉన్న పట్టుతోనే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు.

ఇంటర్‌ తప్పాడు… రూ. 25 లక్షలు దోచాడు
పంజాబ్‌ లూథియానాకు చెందిన తల్వీందర్‌సింగ్‌ వృత్తిరీత్యా డ్రైవర్‌. తండ్రి దుబాయ్‌లో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తుండటంతో ఇంటర్‌తోనే చదువు అపేసిన అతడు కొంతకాలం దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసి మానేశాడు. తనకు ఇంగ్లిష్‌, పంజాబీ, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. దాన్ని అడ్డంపెట్టుకొని ఈజీగా లక్షల రూపాయలు సంపాదించాలనుకున్నాడు. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానని పలు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవాడు. వాటిని చూసి ఫోన్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ, వీసా క్లియరెన్స్‌ పేరుతో ఢిల్లీకి రప్పించి నిలువునా దోచేసేవాడు. ఎల్‌బీనగర్‌ ప్రాంతానికి చెందిన హరిత అనే యువతికి జర్మనీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి రప్పించాడు. తల్లితో కలిసి వెళ్లింది. భోజనంలో మత్తు మందు కలిపి వారి నుంచి 15 తులాల బంగారు నగలు దోచేశాడు. యువతి బ్యాంక్‌ పాస్‌వర్డ్‌లు తెలుసుకొని రూ. 19 లక్షల నగలు కాజేసి ఉడాయించాడు. రాచకొండ పోలీసులు నిందితుడిని పట్టుకొని విచారించగా ఇంటర్‌ కూడా పూర్తి చేయలేదని, ఇదే తరహాలో దేశంలో సుమారు వందమందికి పైగా మోసం చేసినట్టు తేలింది.

షేర్‌మార్కెట్లో లాభాలంటూ…
బెంగళూరులోని హొంగసండ్ర ప్రాంతానికి చెందిన అజయ్‌రాజు అలియాస్‌ సచిన్‌ కుమార్‌ ఇంటర్‌లో చదువు మానేశాడు. షేర్‌ మార్కెట్‌ బ్రోకర్స్‌ వద్ద హెల్పర్‌గా చేరాడు. వివిధ ప్రాంతాలకు చెందిన బ్రోకర్ల వద్ద పనిచేసి ఆరు భాషలపై, ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ షేర్‌మార్కెట్‌పై పట్టు సాఽధించాడు. లక్షలు సంపాదించాలని అనుకున్నాడు. 20 ఏళ్లు నిండకుండానే షేక్‌ మార్కెట్‌ బ్రోకర్‌ అవతారమెత్తాడు. తనకున్న భాషా పరిజ్ఞానం, మాటలతో కస్టమర్లను ఆకట్టుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలా చేస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో ఎల్‌బీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారిని బురిడీ కొట్టించాడు. తాను సూచించిన విధంగా పెట్టుబడులు పెట్టేలా చేసి వెబ్‌సైట్లో లాభాలు వచ్చినట్లు చూపించాడు. అతడికి దశలవారీగా రూ. 14.57 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు.

సేల్స్‌మన్‌… నిరుద్యోగులను ముంచేశాడు
ఢిల్లీలోని మహావీర్‌ ఎన్‌క్లేవ్‌కు చెందిన తుషార్‌ అరోరా అలియాస్‌ ఆనంద్‌ ఇంటర్మీడియట్‌ మధ్యలో ఆపేసి సేల్స్‌మన్‌ ఉద్యోగం చేస్తున్నాడు. తన అన్నయ్యకు కాల్‌సెంటర్‌లో పనిచేసిన అనుభవం ఉండడంతో తాను కూడా కొంత పరిజ్ఞానాన్ని సంపాదించాడు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు క్వికర్‌, షైన్‌, నౌకరీ, ఫోర్‌జాబ్స్‌ లాంటి జాబ్‌ పోర్టల్స్‌లో నమోదు చేసిన రెజ్యూమ్‌ వివరాలను సేకరించాడు. తన అనుచరులతో వారికి ఫోన్లు చేయించి ఎంఎన్‌సీలో, విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించేవాడు. పలు రకాల ఫీజుల పేరుతో రూ. లక్ష నుంచి 5 లక్షల వరకు వసూలు చేసేవాడు. ఆ తర్వాత ఫోన్లు స్విచాఫ్‌ చేసేవారు. ఇలా దేశవ్యాప్తంగా వందల మందిని మోసం చేసి కోట్లు కొల్లగొట్టి చివరకు సైబరాబాద్‌ పోలీసులకు చిక్కాడు.

చదువు ఏడో తరగతి… మోసం వేలకోట్లు
హరియాణాకు చెందిన రాధేశ్యామ్‌ ముఠా గురించి తెలిసిందే. అతడు చదువుకుంది ఏడో తరగతి మాత్రమే. ఫ్యూచర్‌మేకర్‌ సంస్థను స్థాపించి హెల్త్‌ ప్రొడక్ట్‌ల మార్కెటింగ్‌ పేరుతో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసానికి తెరతీశాడు. తన వాక్చాతుర్యంతో లక్షల మందిని బురిడీ కొట్టించి భారీ స్కామ్‌కు పాల్పడ్డాడు. దేశవ్యాప్తంగా 60 లక్షల మందిని ముంచి ఆన్‌లైన్‌ అకౌంట్ల పేరుతో రూ. 3 వేల కోట్లు కొల్లగొట్టి సైబరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. నిందితుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయిన సుమారు రూ. 200 కోట్లను జప్తు చేశారు.

రూ. 30 లక్షలు దోచిన బిహార్‌ యువకులు
బిహార్‌కు చెందిన ముగ్గురు యువకులు చదివింది పదోతరగతి. వారికి 19 ఏళ్లు కూడా లేవు. టెక్నాలజీపై మంచి పట్టుంది. వివిధ రాకాల యాప్స్‌ను వడపోసి వాటి ఆధారంగా టెక్నాలజీని ఉపయోగించి ఆన్‌లైన్‌ మోసాలు చేయడంలో దిట్టలు. ఇటీవల బతుకుదెరువుకోసం బిహార్‌ నుంచి నగరానికి వచ్చిన వీరు షాద్‌నగర్‌లో రూమ్‌ అద్దెకు తీసుకున్నారు. జల్సాలు, వ్యసనాలకు అలవాటుపడ్డారు. ఏటీఎం సెంటర్లకు వచ్చే కస్టమర్ల సీవీవీ నెంబర్‌, పిన్‌నెంబర్లను నోట్‌ చేసుకునేవారు. ఆ తర్వాత వాటి ఆధారంగా ఓటీపీతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసి రూ. లక్షలు కొల్లగొట్టారు. ఇలా 3 నెలల్లో సుమారు 200 డెబిట్‌ కార్డుల సమాచారం తస్కరించి రూ. 30లక్షలు కాజేశారు. చివరకు పోలీసులకు చిక్కారు. అప్రమత్తత, అవగాహనతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చంటున్నారు పోలీసులు.

Check Also

కేసీఆర్‌పై టిక్‌టాక్‌లో అనుచిత వ్యాఖ్యలు

Share this on WhatsAppహైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై టిక్‌టాక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *