ఫిల్మ్ న్యూస్: కెరీర్ ఆరంభంలో స్టార్ హీరోల సరసన అత్యంత గ్లామరస్‌గా నటించిన నయనతార ఆ తర్వాత రూటు మార్చింది. భారీ చిత్రాలు, కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే అంగీకరిస్తోంది. అవన్నీ విజయవంతమవుతుండడంతో ఆమె క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే సినిమా అంగీకరించడానికి ముందు నయన్ పెట్టే కండీషన్లు మాత్రం నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయి. అయినప్పటికీ ఆమెకున్న డిమాండ్ దృష్ట్యా వాటిని దర్శకనిర్మాతలు అంగీకరిస్తున్నారు.
మీడియాకు కూడా చాలా దూరంగా ఉండే నయన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘సినిమా పరిశ్రమలో పూర్తిగా పురుషాధిక్యమే ఉంది. అయినా నేను ఎప్పుడూ సర్దుకుపోలేదు. నాకు నచ్చే కథల్నే ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నా. షూటింగ్ సమయాలు, మేకప్, బట్టల విషయంలో పూర్తిగా నా నిర్ణయమే. అలా అయితేనే సినిమాలు ఒప్పుకుంటా. కొన్ని సందర్భాల్లో గ్లామర్ గురించి ఒత్తిడి ఎదురువుతుంటుంది. అయినా ‘నో’ చెప్పేస్తా. నేను టీవీలు, సినిమాలు చూడను. నేను నటించిన సినిమాలు కూడా నేను చూడను. ఈ లోకం నా గురించి ఏమనుకుంటుందనే బాధ నాకు లేదు. పదేళ్లుగా నేను ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు. అప్పట్నుంచి మీడియాకు దూరంగా ఉంటున్నాన’ని నయన్ తెలిపింది.