Breaking News
Home / States / Andhra Pradesh / బీజేపీకి దూరంగా లేను.. అమిత్‌షా అంటే నాకు ఇష్టం: పవన్‌

బీజేపీకి దూరంగా లేను.. అమిత్‌షా అంటే నాకు ఇష్టం: పవన్‌

హోదా, కొన్ని అంశాల్లో విభేదాలు.. అమిత్‌షా అంటే నాకు ఇష్టం
నేనే తలుచుకుంటే ప్రధాని వద్దకు వెళ్లే వాడిని
చంద్రబాబుతో కూర్చునేవాడిని
2014లాగా కలిసి పోటీచేద్దామనేవాడిని
ఆ నిర్ణయం తీసుకుని ఉంటే..
వైసీపీ నేతలంతా ఏమై ఉండేవారు?
వారు నాకు కృతజ్ఞతలు చెప్పాలి
నేను ఎదురుపడితే నమస్కరించాలి
నాకు వాళ్లు ఎన్ని సార్లు కబురు పంపారు?
నేనేమన్నానో చెబితే అవమానంతో ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు?
వైసీపీ నేతలపై పవన్‌ ఆగ్రహం
తిరుపతి/మదనపల్లె/పీలేరు: బీజేపీతో తాను ఏనాడూ దూరంగా లేనని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, కొన్ని అంశాల్లో మాత్రమే ఆ పార్టీతో విభేదించినట్లు చెప్పారు. వైసీపీ తన పట్ల కృతజ్ఞతతో ఉండాలన్నారు. తాను ఎదురుపడితే ఆ పార్టీ నేతలు రెండు చేతులూ ఎత్తి తనకు నమస్కారం పెట్టాలని చెప్పారు. తాను నిజంగా తలచుకుని ఉంటే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి.. చంద్రబాబు దగ్గర కూర్చుని 2014లో లాగా కలసి పోటీ చేద్దామని నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు మాట్లాడుతున్న నాయకులంతా ఏ స్థాయిలో ఉండేవారోనని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పీలేరు, కలికిరి, వాల్మీకిపురం ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. మదనపల్లెలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

‘ప్రత్యేక హోదా విషయంలో ప్రజల కోరిక మేరకు బీజేపీతో విభేదించాల్సి వచ్చింది. టీడీపీతో అనుబంధం ఉంటే కలిసే పోటీ చేసి ఉండేవాళ్లం. విడిగా పోటీ చేయాల్సిన అవసరమేంటి? వైసీపీ వారు నాకు ఎన్నిసార్లు కబురు పంపించారో, దానికి ఏమి సమాధానమిచ్చి పంపానో చెబితే అవమానంతో ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు’ అని పవన్‌ అన్నారు. ప్రత్యేక హోదా, మరికొన్ని అంశాల కోసమే బీజేపీని విమర్శించాను తప్ప… ఆ పార్టీకి ఏరోజూ దూరం కాలేదని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అంటే తనకు ఇష్టమన్నారు. వైసీపీ నేతలకు మాత్రం షా అంటే భయమని తెలిపారు. అద్భుతమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణ కోసం కీలక నిర్ణయాలు, చర్యలు తీసుకుంటోందని ప్రశంసించారు. అయితే రాష్ట్రంలో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాత్రం కనీసం ఉల్లిపాయలు కూడా అందించలేకపోతోందని ఎద్దేవా చేశారు. కిలో ఉల్లిపాయల కోసం సామాన్య ప్రజలు గంటల కొద్దీ క్యూలలో పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకుండా పోయిందని మండిపడ్డారు. కూల్చివేతలు, పథకాల రద్దుపై కాకుండా ప్రజా సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు. వైసీపీ నేతలు తనపై ఉపయోగిస్తున్న భాష మార్చుకోకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఉర్దూ స్కూళ్లకు ‘ఆంగ్లం’ వర్తిస్తుందా?
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ జారీ చేసిన జీవో ఉర్దూ మీడియం స్కూళ్లకు కూడా వర్తిస్తుందా అని పవన్‌ ప్రశ్నించారు. ఒరియా, తమిళం, కన్నడ, ఉర్దూ, మరాఠీ తదితర మాధ్యమాల స్కూళ్లు అనేకం రాష్ట్రంలో నడుస్తున్నాయని, వీటిని కూడా రద్దు చేసి ఆంగ్ల మీడియం అమలు చేస్తారా లేక కేవలం తెలుగు మీడియం మాత్రమే రద్దు చేస్తారా అన్న దానిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాయలసీమ వెనుకబాటుతనాన్ని సాకుగా చూపి నేతలు బాగుపడుతున్నారని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సి ఉందని..

వాటిని వదిలిపెట్టి ప్రజలకు హాని కలిగించే యురేనియం శుద్ధి ప్లాంటు కావాలని వైసీపీ నేతలు అడగడం కేవలం కాంట్రాక్టుల కోసమేనన్నారు. చాలా కష్టపడితే గానీ పెట్టుబడులు రావని, అలాంటిది రాయలసీమకు కియా కార్ల పరిశ్రమ వస్తే వైసీపీ నాయకులు వారిని బెదిరించడం దారుణమన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు పరిశ్రమలు రావాలి కదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయిందని ఆరోపించారు. కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. ఆరునెలలు కాకముందే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతున్నాయని చెప్పారు. అధికార గర్వంతో జనసైనికులను బెదిరించి కేసులు బనాయించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

మదనపల్లె మార్కెట్‌కు వెళ్లి తీరతా..
‘మదనపల్లె టమాటా మార్కెట్‌కు నన్ను రావద్దన్నారు.. ఎవరడ్డు వస్తారో చూస్తా. అక్కడకు తప్పకుండా వెళ్తా. రైతుల కన్నీళ్లు, కష్టాలు విచారిస్తా’ అని పవన్‌ స్పష్టం చేశారు. ఆయన గురువారం ఉదయం 11 గంటలకు మార్కెట్‌ యార్డుకు వెళ్లాలనుకున్నారు. కానీ అధికారులు తొలుత అనుమతి ఇవ్వలేదు. మార్కెట్‌ వేలం పాటలతో కిక్కిరిసి ఉంటుందని, పవన్‌ వస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని మార్కెట్‌ కమిటీ పర్సన్‌ ఇన్‌చార్జి తెలిపారు. అయితే పవన్‌ ముఖాముఖికి అనుమతి ఇస్తూ అర్ధరాత్రి సమయంలో మార్కెట్‌ కమిటీ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. 11.30 తర్వాత పవన్‌ రైతులు, వ్యాపారులతో భేటీ కావచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రోడ్‌షోకు జనమే జనం!
పీలేరు, కలికిరి, వాల్మీకిపురం ప్రాంతాల్లో జరిగిన పవన్‌ రోడ్‌షోలకు ప్రజలు, అభిమానులు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీధులు జనసంద్రాన్ని తలపించాయి. నిర్ణీత షెడ్యూల్‌ కంటే 4గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీ జనసేనానికి అఖండ స్వాగతం లభించింది. పీలేరులో పవన్‌ ప్రజలనుద్దేశించి నాలుగు నిమిషాలు ఉద్వేగభరితంగా మాట్లాడారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *