Breaking News
Home / States / Andhra Pradesh / అక్రమంగా నగరానికి… రేటు ఎలా ఫిక్స్ చేస్తున్నారంటే..

అక్రమంగా నగరానికి… రేటు ఎలా ఫిక్స్ చేస్తున్నారంటే..

అక్రమంగా నగరానికి… విదేశీ కరెన్సీ
బస్తీలు, హోటళ్లలో యథేచ్ఛగా మార్పిడి
తెలిసినా పట్టించుకోని అధికారులు
హైదరాబాద్‌ సిటీ: కోటి రూపాయలకు పైగా విదేశీ కరెన్సీని విమానాశ్రయంలో ఈనెల 9వ తేదీన పట్టుకున్నారు. అదేరోజు రాత్రి మరో రూ. 38 లక్షల విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఇదంతా నగరానికి ఎలా చేరుతోందని ఆలోచిస్తే ఆశ్చర్యం వేయకతప్పదు. హవాలా పేరిట సాగే అక్రమ దందాలన్నీ పన్నులు ఎగ్గొట్టడానికేనన్న విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ దొడ్డిదారిన దేశంలోకి చేరడం.. తిరిగి దాన్ని అక్కడికి చేర్చడంలో కొంతమంది బడా వ్యాపారులు ఉన్నారు. ఈ దందా దేశ ఆర్థిక వ్యవస్థకు ఆటంకం కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఈ దందాతో వ్యాపారులు బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకొంటుండగా.. కరెన్సీ మార్చే కార్యాలయాల ద్వారా జరిగే తతంగం మారు మూల ప్రాంతాలు, బస్తీలు, హోటళ్లలోని కార్నర్‌ టేబుళ్లపై యథేచ్ఛగా సాగుతోంది. కరెన్సీ మార్పిడి పేరిట సాగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలు కళ్లముందే జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
విదేశాల నుంచి వచ్చే వారు కొంత కరెన్సీ తమతో తీసుకొస్తుంటారు. బ్యాంకుల ద్వారా మార్పిడి చేసుకుంటే దానికి లెక్క చూపడంతోపాటు.. మార్పిడి విలువ ఉంటుంది. కొంతమంది బ్రోకర్లు (బ్లాక్‌ దందా వ్యాపారులు) బ్యాంకులు, కరెన్సీ మార్చే అధికారిక ఏజెంట్లతో కాకుండా నేరుగా కరెన్సీని మార్చే వ్యాపారం చేస్తున్నారు. విదేశీ డబ్బు తీసుకొచ్చిన వ్యక్తి బ్యాంకు రేటు చూసుకున్న తర్వాత బ్రోకర్లను సంప్రదిస్తాడు. బ్యాంకు రేటుకన్నా 5 నుంచి 10 శాతం ఎక్కువ రేటు చెప్పి దాన్ని మార్పిడి చేస్తారు. కస్టమర్‌… బ్రోకర్‌ ఇద్దరూ సంతృప్తి చెందుతారు. ఇలా వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. జమ చేసిన విదేశీ కరెన్సీని తిరిగి అదే దేశానికి పంపించే వ్యాపారులు అక్కడ ఆ డబ్బును వైట్‌ చేసుకుని దేశానికి తిరిగొచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాంకులకు కమీషన్‌ రాకపోగా.. ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కట్టడం లేదు.

దశాబ్దాలుగా దందా
విదేశాల నుంచి వస్తున్న వారు తీసుకొస్తున్న కరెన్సీని ఎయిర్‌పోర్టులోనే మార్చుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత విదేశాల నుంచి వచ్చిన వివరాలు చూపి బ్యాంకులు, కరెన్సీ మార్పిడి ఏజెంట్ల వద్ద మార్చుకోవచ్చు. కొంతమంది మాత్రమే ఆ పద్ధతి పాటిస్తున్నారు. చాలామంది అధిక లాభం కోసం పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసే కొందరు పెద్ద ఏజెంట్లతో ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతూ రేటు ఫిక్స్‌ చేస్తున్నారు. నగరంలో కొనసాగుతున్న మనీట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్లలో చాలామంది అక్రమంగానే కరెన్సీ మార్పిడి చేస్తున్నారు. షహరాన్‌, ఆబిడ్స్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో రోడ్లపైనే నిలబడి… చేతుల్లో నోట్ల కట్టలు పట్టుకొని ఏజెంట్లు యథేచ్ఛగా కరెన్సీని మార్చేస్తున్నారు. దీని గురించి ఆదాయపన్ను శాఖ, పోలీసు అధికారులకు తెలిసినా పట్టించుకోరు. తలా కొంత జమచేసిన కరెన్సీని పెద్ద ఏజెంట్లు దానికి తగ్గ విలువతో పాటు కమీషన్‌ చెల్లించి ఆ కరెన్సీ తీసుకుంటారు. కోట్ల రూపాయలను తిరిగి ఆయా దేశాలకు పంపించిన అక్కడ సంపాదించిన డబ్బుగా చూపించి దేశంలో చలామణిలోకి తీసుకొస్తారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ దందాలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల బ్లాక్‌మనీ వైట్‌గా మారి ఉండవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో అధికారులు పటిష్ఠ నిఘా పెట్టడంతో విదేశీ కరెన్సీ పట్టుబడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *