Breaking News
Home / Crime / బెంగళూరులో బయటపడ్డ భారీ స్కాం.. ఆందోళనలో బాధితులు

బెంగళూరులో బయటపడ్డ భారీ స్కాం.. ఆందోళనలో బాధితులు

కష్టార్జితాన్ని ముట్టజెప్పాం
ఆదుకోకుంటే ఆత్మహత్యలే
ఐఎంఏ బాధితుల కన్నీళ్లు
బెంగళూరు కార్యాలయం వద్ద రద్దీ రద్దీ
మూడు వేల మందికిపైగా ఫిర్యాదు
పత్తా లేని గ్రూప్‌ అధినేత మహమ్మద్‌ మన్సూర్‌
రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన డబ్బును ఐఎంఏలో డిపాజిట్‌ చేశాం, మా డబ్బులు మాకు ఇప్పించండి సార్‌.. అని బాధితుల విలాపం. ఎవరిని కదిపినా ఇదే ఆవేదన. బెంగళూరు శివాజీనగరలోని ఐఎంఏ గ్రూప్‌ సుమారు వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రజల నుంచి సేకరించి బోర్డు తిప్పేయడం సంచలనాత్మకమైంది. ఐటీ సిటీ ఆర్థిక నేరాల అడ్డాగా మారుతోందనే విమర్శలకు ఊతమిస్తోంది.

బెంగళూరు : ఐ మానిటరీ అడ్వైజరీ(ఐఎంఏ) గ్రూప్‌ మన్సూర్‌ ఖాన్‌ విడుదల చేసిన ఆడియో క్లిప్‌తో కర్ణాటక అట్టుడికి పోతుంది. అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రోషన్‌ బయాగ్‌ వంటి వారందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని.. ఫలితంగా తాను మోసపోయానని ఆత్మహత్యే శరణ్యమంటూ ఐఎంఏ గ్రూప్‌ అధినేత మన్సూర్‌ ఖాన్‌ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి.. అదృశ్యమయిపోయారు. ఇప్పటి వరకూ ఆయన ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు.

దాంతో పెద్ద ఎత్తున జనాలు శివాజీనగరలోని ఆఫీసు వద్దకు చేరుకుని.. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం రూపాయి రూపాయి దాచుకున్నామని, డబ్బులు పోతే ఆత్మహత్యలే శరణ్యమని రోదించారు. ఓ వైపు వేల సంఖ్యలో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చెందుతుండగా.. మరో వైపు కాంగ్రెస్‌, బీజేపీ ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

వెల్లువలా వస్తున్న బాధితులు
బాధితుల రద్దీని తట్టుకోవడానికి శివాజీనగరలో సంస్థ కార్యాలయంలోనే పోలీసులు ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని తెరవాల్సి వచ్చింది. పలువురు బాధితులు తమ సొమ్మును ఎలాగైనా ఇప్పించాలని గొడవకు దిగటంతో పోలీసులు వారిని ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించారు. పెద్దసంఖ్యలో బాధిత మహిళలు ఉదయం నుంచే తమ పసిబిడ్డలను ఎత్తుకొని వచ్చి సొమ్ము డిపాజిట్‌ చేసి మోసపోయామని, బ్యాంకులో పెట్టిన సొమ్మును తీసి వారి చేతిలో పెట్టామని వాపోయారు. కూడబెట్టుకున్న సొమ్మును కోల్పోయి తమ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిందని విలపించారు.

బాధితుల ఫిర్యాదులను స్వీకరించామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. మీ సొమ్ము మీకు లభిస్తుందని బాధితులతో చెప్పసాగారు. ఈ క్రమంలో వైద్యుడొకరు ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చినపుడు అస్వస్థతకు గురై మూర్ఛపోగా, తక్షణమే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఐఎంఏలో డిపాజిట్‌ చేసిన వందలాది మంది ఫిర్యాదులు చేయటానికి గ్రూపులు గ్రూపులుగా వస్తునే ఉన్నారు. సుమారు 3, 4 వేల మంది ఫిర్యాదులు చేశారని, ఈ సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది.

ఖాతాల్లోకి కోట్లాది నగదు ప్రవాహం
మన్సూర్‌ఖాన్‌ అదృశ్యం, డిపాజిటర్ల ఫిర్యాదుల నమోదు అయిన తరువాత కూడా సోమవారం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు నగదు ఐఎంఏ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు కమర్షియల్‌ స్ట్రీట్‌ పోలీసుల తనిఖీల్లో తెలిసింది. ఈ కేసులో సుమారు 10 మందికి పైగా బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన బ్యాంకు లావాదేవీల పరిశీలన సందర్భంలో మన్సూర్, డైరెక్టర్లు, ఐఎంఏ ఖాతాకు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా కోట్లాది రూపాయాలు వినియోగదారులు డిపాజిట్‌ చేసినట్లు వెల్లడైంది. స్కాం నేపథ్యంలో మేల్కొన్న పోలీసులు ఐఎంఏ ఖాతాలను సీజ్‌ చేసి, ఎవరూ డిపాజిట్‌ చేయరాదని ప్రజలకు విన్నవించారు. ఆన్‌లైన్‌లో సొమ్ము సేకరించేవారి గురించి పోలీసులు సమాచారాన్ని ఆరా తీస్తున్నారు.

వెనుక ఎవరున్నా విచారణ జరపాలి
ఐఎంఏ జ్యువెల్స్‌ యజమాని అదృశ్య కేసుకు సంబంధించి దీని వెనుక ఎవరున్నా తగిన తనిఖీ జరుపాలని, ప్రభావం కలిగిన రాజకీయ నాయకులున్నా కూడా క్షమించరాదని వక్ఫ్‌ మంత్రి జమీర్‌ అహ్మద్‌ అన్నారు. ఈ విషయమై హోమ్‌ మంత్రి ఎంబీ పాటిల్‌ను కలుసుకున్న తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇదొక అతిపెద్ద వంచన కేసని అన్నారు. దీనిపై సిట్‌ దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. సీబీఐ దర్యాప్తు జరుపాలని విన్నవించినట్లు తెలిపారు. ఐఎంఏ జ్యూవెల్స్‌ యజమాని మహమ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌కు చెందిన నగలను, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని డిపాజిటర్లకు సొమ్మును ఇప్పించాలని హోంమంత్రిని కోరానని తెలిపారు. – మంత్రి జమీర్‌ అహ్మద్‌

డైరెక్టర్ల కోసం గాలింపు
ఐఎంఏ కంపెనీకి చెందిన నలుగురు డైరెక్టర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మన్సూర్‌ ఖాన్‌ గత గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నలుగురు డైరెక్టర్లు పాల్గొన్న విషయాన్ని పోలీసులు సేకరించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో ఏయే సంగతులను చర్చించారనేది ఆరా తీస్తున్నారు. సమావేశం తరువాత డైరెక్టర్ల మొబైల్‌ ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయి. మన్సూర్‌ ఎక్కడ దాక్కున్నాడనేది డైరెక్టర్లకు తెలిసి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. కేసును సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌కు అప్పగించినట్లు తెలిపారు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో బీజేపీ.. కుమారస్వామి, ఐఎంఏ కంపెనీ అధినేత మన్సూర్‌ ఖాన్‌ కలిసి ఉన్న ఫోటోలను ట్విట్‌ర్‌లో షేర్‌ చేసింది. దాంతో పాటు ఈ మోసగాడు మీకు చాలా కాలం నుంచి తెలుసు. ఇప్పుడతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా బాధితుల మాదిరి విలపిస్తే ఫలితం ఉండదంటూ విమర్శించింది.

Check Also

సింహానికి ఎదురుగా కూర్చొని…..

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక వ్యక్తి సింహానికి ఎదురుగా కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *