విజయవాడ: విజయవాడ పోలీసు కార్ గ్రౌండ్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. విజయవాడ నగర పోలీస్ సీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి డీజీపీ ఆయుధ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ అక్టోబర్ 21న ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తామని, పోలీసులు చేసే త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసమే ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మూడు నెలల వ్యవధిలో వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో చాలా చేశామన్నారు. రాజకీయంగా మాట్లాడేదానికీ, కేసు విచారణకు తేడా ఉందని అనవసరపు మాటలు కేసు విచారణను ప్రభావితం చేస్తాయని డీజీపీ అన్నారు. వివేకానందరెడ్డి కేసు విచారణ జరుగుతోందని ఈ కేసుపై ఊహాగానాలు ప్రచారం చేసే వారికి నోటీసులు పంపుతామని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు చాలా తగ్గాయని, హింస, రక్తపాతం తప్ప మావోయిస్టులు సాధించేదేమీ లేదని డీజీపీ పేర్కొన్నారు.
