Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అలాంటి వారికి తక్షణ శిక్ష: ఏపీ సీఎం

అలాంటి వారికి తక్షణ శిక్ష: ఏపీ సీఎం

ప్రత్యేక కోర్టులతో 2 వారాల్లో ట్రయల్‌ పూర్తి
21 పనిదినాల్లో దోషులకు ఉరిశిక్ష పడాలి
మహిళల రక్షణకు విప్లవాత్మక బిల్లు
రేపే అసెంబ్లీలో ప్రవేశపెడతాం: జగన్‌
దారుణ స్థితిలో ప్రస్తుత చట్టాలు
సోషల్‌ మీడియా దిగజారిపోయింది
తప్పుడు పోస్టింగ్‌ పెడితే కఠిన చర్యలు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్పష్టీకరణ
అమరావతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులను నిరోధించేందుకు, తప్పులు జరిగితే దోషులకు సత్వరమే కఠిన శిక్షలు విధించేలా విప్లవాత్మక బిల్లు రూపొందించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ బిల్లును బుధవారం సభలో ప్రవేశపెడతామని వెల్లడించారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు
తన మనుసును కలిచివేశాయని, అందుకే కఠినమైన చట్టం ఉండాలన్న ఉద్దేశంతో బిల్లును తీసుకొస్తున్నామన్నారు. దిశ హత్యకేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ సంఘటనను ప్రస్తావిస్తూ.. కాల్చేసినా తప్పులేదనుకున్నానని వెల్లడించారు. మహిళ రక్షణపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, పోలీసు అధికారులకు శాసనసభ సాక్షిగా హ్యాట్సాఫ్‌ చెప్పారు. ఇంకా చట్టాలు, కోర్టులు విధించే శిక్షలు, సోషల్‌ మీడియాపై పలు వ్యాఖ్యలు చేశారు. నిర్భయ కేసులో దోషులకు నేటికీ శిక్షలు పడలేదని, వారు బయటే తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అత్యాచార దోషులకు శిక్ష వెంటనే పడాలని నిర్భయ చట్టం తీసుకొచ్చాం. నాలుగు నెలల్లో తీర్పు ఇవ్వాలి.. నాలుగు నెలల్లో శిక్షపడాలని చట్టం చెబుతోంది. ఏడేళ్లయింది. నిర్భయ బాధితులు( నిందితులు) ఇవాల్టికీ తిరుగుతున్నారు. ఎటువంటి శిక్షపడని పరిస్థితుల్లో చట్టాలున్నాయి. ఏదైనా జరిగితే వెంటనే న్యాయం దక్కాలని మహిళలు, ప్రతి చెల్లీ కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం కూడా అదే దిశగా ఆలోచిస్తోంది. ఎవరైనా కూడా చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని టకటకా కాల్చేయాలని అనుకోరు. కానీ జరుగుతున్న జాప్యం చూసినప్పుడు.. ఇక దోషులకు శిక్షపడదు.. వారు తప్పించుకోగలరు.. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా ఎటువంటి న్యాయం జరగదని అనిపించినప్పుడు.. కోర్టులు కూడా ఇంత జాప్యం చేసే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు.. వారికి శిక్ష పడదని అపనమ్మకం కలిగిస్తున్న పరిస్థితుల్లో… వారిని ఎవరైనా కాల్చేస్తే వాళ్లను హీరోలుగా భావించి చప్పట్లుకొట్టే పరిస్థితిలో మన సమాజం ఉంది. ఈ చట్టాలు మారాలి. తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. చట్టాలు ఇంకా గట్టిగా బలపడాలి’ అని ఆయన ఆకాంక్షించారు.

తాగితే రాక్షసుడవుతాడు..
ఐదారుగురు మనుషులు కలిసి తాగితే మృగాళ్లవుతున్నారని జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే మద్యం షాపుల వెంట పర్మిట్‌ రూములను రద్దుచేశామన్నారు. ‘మనిషి రాక్షసుడు ఎప్పుడు అవుతాడు? జ్ఞానం ఎప్పుడు కోల్పోతాడు? తాగితే. ఒకరికి నలుగురు తోడయితే, తాగుతూ కూర్చుంటే ఆలోచనలు మారుతాయి. రాక్షసులవుతారు. అందుకే పర్మిట్‌ రూములు రద్దుచేశాం. మద్య నియంత్రణ చేపట్టాం. 43 వేల బెల్ట్‌షాపులు రద్దుచేశామని సగర్వంగా చెబుతున్నా. అశ్లీలత (పోర్నోగ్రఫీ) కూడా చెడగొడుతోంది. స్మార్ట్‌ఫోన్‌ వల్ల కలుగుతున్న నష్టం ఇదే. ఎన్ని నిషేధాలున్నా కట్టడిచేయలేకపోతున్నాం. ఐపీ అడ్ర్‌సలను బ్లాక్‌చేస్తున్నా ఇంకా కనిపిస్తోంది. ఇవన్నీ మారాలి. మార్చుతూ విప్లవాత్మక బిల్లు తీసుకొస్తాం’ అని చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *