Breaking News
Home / Lifestyle / Business / స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా ఐదో రోజూ లాభాలు జోరు

స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా ఐదో రోజూ లాభాలు జోరు

5 నెలల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లిన సూచీలు
ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా ఐదో రోజూ లాభాలు నమోదయ్యాయి. ప్రధాన సూచీలు రెండూ ఐదు నెలల గరిష్ఠ స్థాయి దగ్గర క్లోజయ్యాయి. సెన్సెక్స్‌ 358.42 పాయింట్ల లాభంతో 36,975.23 వద్ద, నిఫ్టీ 128.10 పాయింట్ల లాభంతో 11,062.45 వద్ద ముగిశాయి. గత ఏడాది అక్టోబరు1 తర్వాత నిఫ్టీ మళ్లీ 11,000 పాయింట్లపైన ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల దన్నుతో ఈ ర్యాలీ కొనసాగింది. గురువారం ఆర్‌బీఐ ప్రకటించే ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లు తగ్గించకపోయినా, తటస్థ వైఖరి కొనసాగించే అవకాశం ఉందన్న వార్తలు, ఈ ర్యాలీకి ప్రధానంగా దోహదం చేశాయి.

కొనసాగుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో సంస్థ(ఎ్‌ఫపీఐ)ల పెట్టుబడులూ సెంటిమెంట్‌ను పెంచాయి. ‘ప్రభుత్వ రుణ పత్రాలపై రాబడులు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం రేటు స్వల్పంగా కోలుకోవడమూ ఈ ర్యాలీకి దోహదం చేశా యి’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. మెటల్‌, ఐటీ, ఎనర్జీ, ఆటో, ఫైనాన్సియల్‌ కంపెనీల ఇండెక్స్‌లు 2.44 శాతం వరకు పెరిగాయి. కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ ఇండెక్స్‌ మాత్రమే స్వల్పంగా నష్టపోయింది. సెన్సెక్స్‌ షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండ్‌సబ్యాంక్‌ షేర్లు కొద్దిపాటి నష్టాలతో ముగిశాయి. టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీల షేర్లు 4.34 శాతం వరకు లాభాలు నమోదు చేశాయి.

అడాగ్‌ షేర్లలో ఆగని పతనం
అనిల్‌ అంబానీ సారథ్యంలోని అడాగ్‌ గ్రూపు కంపెనీల షేర్లలో పతనం కొనసాగుతోంది. బుధవారం ఈ గ్రూపులోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కంపెనీ షేర్లు బీఎ్‌సఈలో 32.22 శాతం నష్టపోయి రూ.154 వద్ద ముగిశాయి. ఆర్‌కామ్‌ షేర్లూ ఒక దశలో 11 శాతం నష్టంతో రూ.4.85 కనిష్ఠ స్థాయిని తాకాయి. చివరికి 0.74 శాతం స్వల్పలాభంతో రూ.5.48 వద్ద ముగిశాయి. రిలయన్స్‌ పవర్‌ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో ఒక దశలో 14 శాతం నష్టపోయినా తర్వాత కోలుకుని 6.69 శాతం లాభంతో రూ.12.75 దగ్గర ముగిశాయి. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ (8.28 శాతం), రిలయన్స్‌ (5.73 శాతం) కంపెనీల షేర్లూ నష్టాల బాట పట్టాయి. ఇదే గ్రూపునకు చెందిన రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ షేర్లు మాత్రం 17.35 శాతం లాభంతో రూ.161 దగ్గర క్లోజయ్యాయి.

టెక్‌ మహీంద్రా షేర్లలో ర్యాలీ
మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల దన్నుతో టెక్‌ మహీంద్రా కంపెనీ షేరు కొత్త గరిష్ఠ స్థాయికి చేరాయి. బీఎ్‌సఈలో ఈ కంపెనీ షేరు ఒక దశలో రూ.814 ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరాయి. చివరికి 8.13 శాతం లాభంతో రూ.811 వద్ద క్లోజయ్యాయి.

నెలాఖర్లో మజ్‌గావ్‌ డాక్‌ పబ్లిక్‌ ఇష్యూ
ఈ నెలాఖర్లో ప్రభుత్వ రంగంలోని మజ్‌గావ్‌ డాక్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ ఇష్యూ ద్వారా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లు సమీకరించాలని ఈ రక్షణ రంగ సంస్థ భావిస్తోంది. గత ఏడాది ఆగస్టులోని సెబీ నుంచి ఈ ఐపీఓకు ఆమోదం లభించింది.

Check Also

పసిడికి కళ

Share this on WhatsAppమళ్లీ మదుపర్లను ఆకర్షిస్తున్న బంగారం అంతర్జాతీయ పరిణామాలే కారణం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *