Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / బొగ్గు సరఫరా పెంచండి

బొగ్గు సరఫరా పెంచండి

కేంద్ర మంత్రికి సీఎం జగన్‌ లేఖ
సింగరేణి నుంచీ 9 ర్యాక్స్‌ ఇవ్వండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి
70 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు కావాలి
ప్రస్తుతం 45 వేల టన్నులే అందుతోంది
మహానది, సింగరేణితో మాట్లాడుతున్నాం
పూర్తిస్థాయి విద్యుదుత్పత్తికి చర్యలు
ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన
అమరావతి: రాష్ట్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి ఏపీ జెన్కోతోపాటు ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వెల్లడించింది. అన్ని రాష్ట్రాలూ కరెంటు కొనుగోళ్లు, విక్రయాలు చేసే విద్యుత్‌ ఎక్స్ఛేంజీలో విద్యుత్‌ కొనుగోలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌పై నిషేధం విధించడం, బొగ్గు సరఫరా లేక థర్మల్‌ కేంద్రాలు ఉత్పత్తి సాగించలేకపోవడం.. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా రోజూ రెండు గంటల చొప్పున కరెంటు కోతలు విధిస్తున్న వైనంపై ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ఏపీ ‘పవర్‌’ కట్‌ అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై సీఎంవో ఆదివారం స్పందించింది. పూర్తిస్థాయి విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేగాక.. ఒప్పందం ప్రకారం సరిపడా బొగ్గును సరఫరా చేయాలని.. సరఫరాను మరింత పెంచడానికి ప్రత్యామ్నాయం చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర బొగ్గు శాఖకు ఓ లేఖ రాశారని తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు.. కేంద్రంలోని సంబంధిత శాఖలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది. సింగరేణి నుంచి సరఫరాను రోజుకు 4 ర్యాక్స్‌ నుంచి 9 ర్యాక్స్‌ పెంచాలని సీఎం ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరినట్లు తెలిపింది. విద్యుత్‌ సరఫరా తగ్గడానికి కారణాలను కూడా ప్రకటనలో తెలియజేసింది.

‘హరియాణా, పంజాబ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ నుంచి మనం 2018 నవంబరు, డిసెంబరు నెలల్లో, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో 3,800 మిలియన్‌ యూనిట్లు నిరంతర విద్యుత్‌ అప్పుగా తీసుకున్నాం. దీనికి ప్రతిఫలంగా 1,500 మెగావాట్ల విద్యుత్‌ను జూన్‌ 15 నుంచి తిరిగి వారికి ఇస్తున్నాం. ఆదివారంతో ఈ విద్యుత్‌ చెల్లింపుల ప్రక్రియ ముగుస్తుంది’ అని వివరించింది. విద్యుత్‌ కంపెనీల నుంచి కరెంటు కొనుగోళ్ల కోసం గతంలో అడ్వాన్స్‌ స్థానంలో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని.. 400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న కేఎ్‌సకే థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ తనకు చాలా రోజుల నుంచి చెల్లింపులు చేయడం లేదంటూ ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. ఆదివారంలోగా దీన్ని కూడా పరిష్కరిస్తుందని ప్రకటనలో వెల్లడించింది.

సమ్మెతో బొగ్గు సరఫరాకు కోత..
రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల కరెంటు ఉత్పత్తి సామర్థ్యం 5010 మెగావాట్లు ఉందని పీఎంవో పేర్కొంది. ‘బొగ్గు సరఫరా కోసం మహానది కోల్‌ లిమిటెడ్‌ (ఎంసీఎల్‌), సింగరేణి (ఎస్సీసీఎల్‌) సంస్థలతో థర్మల్‌ కేంద్రాలు ఒప్పందం చేసుకున్నాయి. ఏడాదికి 17,968 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ఎంసీఎల్‌ సరఫరా చేయాల్సి ఉండగా.. సింగరేణి సంస్థ నుంచి 8.88 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. గడచిన ఏడాదిలో 12,679 మిలియన్‌ యూనిట్ల కరెంటును ఏపీ జెన్కో థర్మల్‌ సంస్థలు ఉత్పత్తి చేయగా.. ఇప్పుడు 14,062 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. అంతేగాకుండా గత ఏడాది అదనంగా 11 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గును వినియోగించారు. భరత్‌పూర్‌లోని ఎంసీఏల్లో జూలై చివరి వారంలో ప్రమాదం జరిగింది. దాని ఫలితంగా కార్మికులు 15 రోజుల పాటు సమ్మె చేయడంతో ఏపీ జెన్‌కో థర్మల్‌ కేంద్రాలకు రావలసిన బొగ్గు సరఫరాలో భారీగా కోత పడింది. మళ్లీ ఈ నెల మూడో వారంలో ఎంసీఏలో మూడు రోజులు, సింగరేణిలో ఒక రోజు సమ్మె పాటించడంతో నిర్దేశించిన రీతిలో బొగ్గు థర్మల్‌ కేంద్రాలకు అందలేదు. బేస్‌లోడ్‌ పవర్‌ అందిస్తున్న థర్మల్‌ కేంద్రాల ఉత్పత్తిని ఈ పరిణామాలు దెబ్బతీశాయి. డొంకరాయి, దిగువ సీలేరు మధ్య విద్యుదుత్పాదన కోసం ఉద్దేశించిన పవర్‌ కెనాల్‌కు ఆగస్టు 12న భారీ వరద కారణంగా గండిపడింది. దీన్ని పునరుద్ధరించడానికి పనులు చేస్తున్నా.. వర్షాల కారణంగా పనులు ముందుకు సాగడం లేదు.

దీనివల్ల 300 నుంచి 400 మెగావాట్ల విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పనులను పూర్తి చేయడానికి ఏపీ జెన్‌కో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. వీటితో పాటు మహానది కోల్‌ఫీల్డ్స్‌లోనూ, ఇటు సింగరేణిలోనూ సెప్టెంబరులో కుండపోతగా వానలు కురిశాయి. దీంతో ఏపీ జెన్‌కోకు అందాల్సిన బొగ్గు సరఫరా సక్రమంగా జరగడం లేదు. జెన్‌కో థర్మల్‌ సంస్థల ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) 85 శాతానికి చేరుకోవాలంటే.. దాదాపు 70 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు కావలసి ఉండగా.. ప్రస్తుతం 45 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు మాత్రమే ఎంసీఎల్‌, సింగరేణి సంస్థల నుంచి అందుతోంది. బొగ్గు కొరతను తీర్చడానికి, సరఫరాను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి ఏపీ జెన్‌కో అధికారులు మహానది, సింగరేణి సంస్థల ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతున్నారు’ అని సీఎంవో పేర్కొంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *