న్యూఢిల్లీ: భారతదేశంలో ఆకలితో అలమటించేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఆహార భద్రత కల్పించడం, పేదరిక నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్ఐ)-2019 ప్రకారం భారత్‌కు పొరుగున ఉన్న పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు మనకంటే మెరుగైన స్థానంలో నిలిచాయి. 117 దేశాల్లో పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొని జాబితా రూపొందించారు. 2015లో 93వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 102వ స్థానానికి దిగజారింది. అన్ని రంగాల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాక్ సైతం 2019 ర్యాంకింగ్స్‌లో 94వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ 88, నేపాల్ 73, దక్షిణాఫ్రికా 59 ర్యాంకులు సాధించాయి. 30.3 పాయింట్లతో భారత్ అట్టడుగున నిలిచి ఆందోళన కల్గిస్తోంది. జీహెచ్ఐలో 2014లో 55వ స్థానంలో ఉన్న భారత్ 2019లో 102కు దిగజారింది. ప్రతి ఏడాది అధ్యయనం కోసం పరిగణనలోకి తీసుకునే దేశాల సంఖ్య మారుతూ వస్తోంది. 2014లో మొత్తం 76 దేశాల్లో సర్వే చేయగా భారత్ 55వ ర్యాంకు దక్కించుకుంది. 2017లో 119 దేశాలతో నివేదిక రూపొందించగా భారత్ 100లో నిలిచింది. అదే విధంగా 2018లో 119 దేశాల్లో అధ్యయనం చేయగా 103వ స్థానంలో నిలిచిన ఇండియా ఈ ఏడాది మొత్తం 117 దేశాల్లో పరిశోధన జరుపగా భారత్ 102వ స్థానంలో నిలువడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
