పుణె: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో టెస్టు మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. అంతేకాదు, ఈ విజయంతో భారత్ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. సొంతగడ్డపై కోహ్లీ సేనకు ఇది వరుసగా 11వ విజయం. 10 విజయాలతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. 1994-2001, 2004-2008 మధ్య ఆస్ట్రేలియా రెండుసార్లు వరుసగా పది టెస్టు విజయాలు సాధించింది. ఇప్పుడు 11 విజయాలతో భారత్ ఆ రికార్డును అధిగమించింది.
ఇన్నింగ్స్ పరుగుల తేడాతో జట్టును గెలిపించడం కోహ్లీకి ఇది 8వ సారి. ధోనీ 9సార్లు ఇలా జట్టును గెలిపించాడు. ఇక, కెప్టెన్గా జట్టుకు అత్యధిక విజయాలు అందించిన వారి జాబితాలో కోహ్లీది మూడోస్థానం. 50 టెస్టులకు సారథ్యం వహించిన కోహ్లీ 30 విజయాలు అందించాడు. కోహ్లీ కంటే ముందు స్టీవా (37), రికీ పాంటింగ్ (35) ఉన్నారు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 19 నుంచి రాంచీలో చివరి టెస్టు ప్రారంభం కానుంది.