Breaking News
Home / Sports / విండీస్‌పై భారత్‌ ఘన విజయం

విండీస్‌పై భారత్‌ ఘన విజయం

తొలుత రోహిత్‌ శర్మ, అతడికి తోడుగా కేఎల్‌ రాహుల్‌, చివర్లో కెప్టెన్‌ కోహ్లీ.. వెస్టిండీస్‌ బౌలర్ల భరతం పట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. అలవోకగా సిక్సర్లు, బౌండరీలు బాదేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. భారత్‌ స్కోరును 250కి చేరువ చేశారు. సొంత గ్రౌండ్‌లో వేలాదిమంది ప్రేక్షకులు.. రోహిత్‌ రోహిత్‌ అని నినదిస్తుండగా టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రెచ్చిపోయాడు. తొలి రెండు టీ20ల్లో విఫలమైన తన బ్యాట్‌కు పని చెప్పకపోతే సిరీస్‌ చేజారే ప్రమాదం ఏర్పడిన వేళ రోహిత్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. భారీ సిక్సర్లు, చూడముచ్చటైన ఫోర్లతో 71 రన్స్‌ చేశాడు. రోహిత్‌ స్ఫూర్తితో రాహుల్‌ విజృంభించగా.. కళాత్మక షాట్లతో విరాట్‌ సిక్సర్ల సునామీ సృష్టించిన వేళ.. వాంఖడేలో పరుగులు వెల్లువెత్తాయి. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను బౌలర్లు ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేయడంతో భారత్‌ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

చెలరేగిన రోహిత్‌, రాహుల్‌, కోహ్లీ
విండీస్‌పై భారత్‌ ఘన విజయం
2-1తో సిరీస్‌ కైవసం

ముంబై: సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా అమోఘ ప్రదర్శన చేసింది. చెత్త ఫీల్డింగ్‌, అంతంతమాత్రం బ్యాటింగ్‌, పసలేని బౌలింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న తరుణాన పట్టుదలగా ఆడింది. అటు బ్యాట్స్‌మెన్‌, ఇటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఆఖరి టీ20లో వెస్టిండీ్‌సను 67 రన్స్‌ తేడాతో చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను 2-1తో గెలుచుకుంది. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 రన్స్‌ చేసింది. రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71), కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 91), కోహ్లీ (29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 70 నాటౌట్‌) సూపర్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు. భారీ ఛేదనలో వెస్టిండీస్‌ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 173 పరుగులే చేసింది. పొలార్డ్‌ (39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68), హెట్‌మయెర్‌ (24 బంతుల్లో ఫోర్‌, 5 సిక్సర్లతో 41) మాత్రమే రాణించారు. దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌, షమి, కుల్దీప్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రాహుల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, కోహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీ్‌సగా నిలిచారు.

రెండో ఓవర్లోనే షాక్‌
భారీ లక్ష్య ఛేదనలో విండీ్‌సకు రెండో ఓవర్లోనే కింగ్‌ (5)ను అవుట్‌ చేయడం ద్వారా భువనేశ్వర్‌ షాకిచ్చాడు. షమి తన మొదటి ఓవర్లోనే సిమన్స్‌ (7)ను అవుట్‌ చేయగా..నాలుగో ఓవర్లో పూరన్‌ (0)ను చాహర్‌ పెవిలియన్‌కు పంపడంతో విండీస్‌ 17/3తో కష్టాల్లో పడింది. కానీ పొలార్డ్‌-హెట్‌మయెర్‌ భారీషాట్లతో భారత్‌లో కలవరం కలిగించారు. 4వ వికెట్‌కు 74 రన్స్‌ జోడించి ప్రమాదకరంగా మారుతుండగా..హెట్‌మయెర్‌ను రాహుల్‌ ద్వారా క్యాచవుట్‌ చేసిన కుల్దీప్‌ ఈ జోడీని విడదీశాడు. వెంటనే హోల్డర్‌ (8)ను కూడా కుల్దీప్‌ అవుట్‌ చేశాడు. భారీషాట్లతో చెలరేగుతున్న పొలార్డ్‌ ఇన్నింగ్స్‌కు భువీ ముగింపు పలికాడు. అనంతరం వాల్ష్‌ (11), పియర్‌ (6) త్వరగా నిష్క్రమించగా.. విలియమ్స్‌ (13), కాట్రెల్‌ (4) నాటౌట్‌గా నిలిచారు.

రోహిత్‌, రాహుల్‌ దూకుడు..
అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కాట్రెల్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతిని రోహిత్‌ బౌండరీకి తరలించగా.. రెండో ఓవర్లో రాహుల్‌ 2 బౌండరీలు కొట్టాడు. అయితే కాట్రెల్‌ వేసిన రెండో ఓవర్‌ మొదటి బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా సిక్సర్‌గా దంచిన రోహిత్‌.. రెండో బంతిని మిడ్‌వికెట్‌లో బౌండరీగా మలిచాడు. చివరి బంతికి మరో ఫోర్‌ కొట్టడంతో మూడో ఓవర్లో భారత్‌కు 16 రన్స్‌ వచ్చాయి. హోల్డర్‌ వేసిన నాలుగో ఓవర్లో రాహుల్‌ వరుసగా 2 ఫోర్లు కొట్టగా.. ఐదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన లెఫ్టామ్‌ స్పిన్నర్‌ పియర్‌ను రోహిత్‌ సిక్సర్‌తో ఆహ్వానించాడు. మూడో బంతిని రోహిత్‌ బౌండరీకి తరలించడంతో ఆ ఓవర్లో 14 రన్స్‌ లభించాయి. అటు రాహుల్‌ కూడా బ్యాటుకు పని చెబుతూ విలియమ్స్‌ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. దాంతో పవర్‌ ప్లే ముగిసేసరికి భారత్‌ 72 రన్స్‌ చేసింది. ఇక..పియర్‌ వేసిన 8వ ఓవర్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన రోహిత్‌.. రెండు సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అతడు చివరి బంతిని బౌండరీకి తరలించాడు. ఆపై రాహుల్‌ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కానీ 12వ ఓవర్లో కెస్రిక్‌ విలియమ్స్‌.. రోహిత్‌ను అవుట్‌ చేయడంతో విండీస్‌ ఊపిరిపీల్చుకుంది. రోహిత్‌, రాహుల్‌ తొలి వికెట్‌కు 135 రన్స్‌ జోడించారు.

కోహ్లీ, రాహుల్‌..ఆకాశమే హద్దు
బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందొచ్చిన పంత్‌ (0) భారీషాట్‌ కొట్టబోయి హోల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. వరుసగా రెండు వికెట్లు పడడంతో రన్‌రేట్‌కు కొంత బ్రేక్‌ పడినా.. లెగ్‌స్పిన్నర్‌ వాల్ష్‌ వేసిన 14వ ఓవర్‌ ఆఖరి బంతిని స్లాగ్‌స్వీ్‌పతో కోహ్లీ సిక్సర్‌గా మలిచాడు. తదుపరి ఓవర్లో హోల్డర్‌ వేసిన ఫుల్‌లెంగ్త్‌ బంతిని లెగ్‌స్టంప్‌ అవతలికి వెళ్లి.. ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా రాహుల్‌ సిక్సర్‌గా కొట్టిన తీరు అద్భుతం. ఇదే ఓవర్లో రెచ్చిపోయిన కోహ్లీ 4,6,4 దంచడంతో ఆ 15వ ఓవర్లో భారత్‌ 22 రన్స్‌ రాబట్టింది. ఇక్కడి నుంచి రాహుల్‌, కోహ్లీ బ్యాట్లు మరింత ఝళిపించారు. 18వ ఓవర్లో రాహుల్‌, విరాట్‌ చెరో సిక్సర్‌ సాధించగా.. పొలార్డ్‌ వేసిన 19 ఓవర్లో విరాట్‌ 6,6,4,6 కొట్టి హాఫ్‌ సెంచరీ దాటడంతో స్టేడియం హోరెత్తింది. కాట్రెల్‌ వేసిన ఆఖరి ఓవర్‌ రెండో బంతికి విండీస్‌ జట్టు కోహ్లీ కాట్‌ బిహైండ్‌కు అప్పీలు చేసింది. అంపైర్‌ నితిన్‌ మెనన్‌ అవుటివ్వగా.. కోహ్లీ సమీక్షకు వెళ్లాడు. అయుతే బంతి హెల్మెట్‌కు తగిలినట్టు రివ్యూలో తేలడంతో మూడో అంపైర్‌ విరాట్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. నాలుగో బంతికి రాహుల్‌ను కాట్రెల్‌ వెనక్కిపంపగా..ఆఖరి బంతికి అద్భుత సిక్సర్‌తో కోహ్లీ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

400 కాట్రెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన రోహిత్‌కు అన్ని ఫార్మాట్లలో అది 400వ సిక్సర్‌. ఈ ఘనత సాధించిన మొదటి భారత బ్యాట్స్‌మన్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు.

స్వదేశంలో టీ20ల్లో వేయికిపైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌ కోహ్లీ

వాంఖడేలో ఇదే (240/3) అత్యధిక స్కోరు. గతంలో ఇక్కడ 2016 టీ20 వరల్డ్‌క్‌పలో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్‌ 230 స్కోరు చేసింది.

స్కోరు బోర్డు
భారత్‌: రోహిత్‌ శర్మ (సి) హేడెన్‌ (బి) విలియమ్స్‌ 71, కేఎల్‌ రాహుల్‌ (సి) పూరన్‌ (బి) కాట్రెల్‌ 91, రిషభ్‌ పంత్‌ (సి) హోల్డర్‌ (బి) పొలార్డ్‌ 0, కోహ్లీ (నాటౌట్‌) 70, శ్రేయాస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 240/3; వికెట్ల పతనం: 1-135, 2-138, 3-233; బౌలింగ్‌: షెల్డన్‌ కాట్రెల్‌ 4-0-40-1, హోల్డర్‌ 4-0-54-0, పియర్‌ 2-0-35-0, విలియమ్స్‌ 4-0-37-1, హేడెన్‌ వాల్ష్‌ 4-0-38-0, పొలార్డ్‌ 2-0-33-1.

వెస్టిండీస్‌: లెండిల్‌ సిమన్స్‌ (సి) శ్రేయాస్‌ (బి) షమి 7, బ్రండన్‌ కింగ్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) భువనేశ్వర్‌ 5, షిమ్రన్‌ హెట్‌మయర్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) కుల్దీప్‌ 41, నికొలస్‌ పూరన్‌ (సి) దూబే (బి) దీపక్‌ 0, పొలార్డ్‌ (సి/సబ్‌) జడేజా (బి) భువనేశ్వర్‌ 68, హోల్డర్‌ (సి/సబ్‌) మనీష్‌ పాండే (బి) కుల్దీప్‌ 8, హేడెన్‌ వాల్ష్‌ (బి) షమి 11, పియర్‌ (సి/సబ్‌) జడేజా (బి) దీపక్‌ 6, కెస్రిక్‌ విలియమ్స్‌ (నాటౌట్‌) 13, కాట్రెల్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 173/8; వికెట్ల పతనం: 1-12, 2-17, 3-17, 4-91, 5-103, 6-141, 7-152, 8-169; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-20-2, భువనేశ్వర్‌ 4-0-41-2, మహమ్మద్‌ షమి 4-0-25-2, శివమ్‌ దూబే 3-0-32-0, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-45-2, వాషింగ్టన్‌ సుందర్‌ 1-0-5-0.3

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *