Breaking News
Home / National / భారత ఎన్నికల సంస్కర్త టీఎన్‌ శేషన్‌ కన్నుమూత

భారత ఎన్నికల సంస్కర్త టీఎన్‌ శేషన్‌ కన్నుమూత

వృద్ధాప్య సమస్యలతో చెన్నైలో తుది శ్వాస
భారత్‌లో ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడు
ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇప్పుడు మనం గుర్తింపు కార్డును ఉపయోగిస్తున్నాం కదా! అది ఆయన చలవే!
ఎన్నికల నిబంధనావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌)పై ఇప్పుడు పూర్తి అవగాహన ఉంది కదా! అది కూడా ఆయన హయాం నుంచే!
తనకున్న అధికారాన్ని సమర్థంగా ఉపయోగించింది.. రాజ్యాంగ వ్యవస్థలకు క్రియాశీలత కల్పించింది ఆయనే!

ఆయన.. దేశంలో ఎన్నికల కమిషన్‌కు ఒక గుర్తింపు తీసుకొచ్చారు! ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు ఎన్ని అధికారాలు ఉంటాయో దేశానికి చూపించారు. అప్పటి వరకూ అస్తవ్యస్తంగా సాగిపోతున్న ఎన్నికలు, ఎన్నికల కమిషన్‌ వ్యవస్థను సంస్కరించారు! సంస్కరణలను కఠినంగా అమలు చేసి ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకున్నారు! దేశంలో ఎన్నికల వ్యవస్థకు కొత్త రూపు ఇచ్చిన.. ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడుగా నిలిచిన మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ (87) ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో కొన్నేళ్లుగా చెన్నైలోని తన స్వగృహంలో ఉంటున్న ఆయన.. ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా తిరునెళ్లాయిలో 1932 డిసెంబరులో జన్మించిన టీఎన్‌ శేషన్‌ ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు.

తమిళనాడు కేడర్‌ నుంచి 1955 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శేషన్‌.. దేశానికి 18వ కేబినెట్‌ సెక్రటరీగా పని చేశారు. అనంతరం ఎన్నికల కమిషన్‌కు పదో సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 1990 డిసెంబరు 12 నుంచి 1996 డిసెంబరు 11 వరకూ ఆరేళ్లపాటు ఆయన సీఈసీగా వ్యవహరించారు. అప్పట్లో ఎన్నికల నిబంధనలను పట్టించుకునే పరిస్థితి లేదు. డబ్బు, కండ బలానిదే పైచేయి. ఈ ఎన్నికల అక్రమాలను సంస్కరించేందుకు శేషన్‌ ప్రయత్నించారు. నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేసి.. అప్పట్లో చండశాసనుడుగా పేరు తెచ్చుకున్నారు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి కేఆర్‌ నారాయణన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల సంస్కరణలకు గాను 1996లో ఆయన రామన్‌ మెగసెసె అవార్డును అందుకున్నారు. సత్యసాయి బాబా భక్తుడైన శేషన్‌.. అప్పట్లో తరచూ పుట్టపర్తికి వస్తూ ఉండేవారు. శేషన్‌ మరణించిన విషయాన్ని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ వెల్లడించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.
ఎన్నికల సంఘమంటూ ఒకటుందని, ఆ సంఘానికి కోరలుంటాయని… ఆయన వచ్చేదాకా సామాన్యులకు తెలియదు! ఎవరిదాకానో ఎందుకు… అంతకుముందు వరకు ఎన్నికల కమిషనర్లుగా చేసిన వారికే తమ అధికారాలేమిటో పూర్తిగా తెలియదు! టీఎన్‌ శేషన్‌ వచ్చారు. సింహంలా గర్జించారు. అభ్యర్థులను వణికించారు. ఎన్నికలొచ్చినా గోడలు ఖరాబు కావడంలేదంటే, విచ్చలవిడిగా పార్టీల జెండాలు ఎగరడంలేదంటే, రాత్రి పదికి మైకులు బంద్‌ అవుతున్నాయంటే, ఖర్చు లెక్కలు చెప్పాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారంటే… దానికి కారణం టీఎన్‌ శేషన్‌! భారత ఎన్నికల కమిషన్‌ గురించి చెప్పాలంటే… శేషన్‌కు ముందు, ఆయన తర్వాత అని చెప్పాల్సిందే!
– న్యూఢిల్లీ
శేషన్‌ ఘనతలు
ఎన్నికల నిబంధనావళి తూచా తప్పకుండా అమలు కావడానికి చర్యలు తీసుకున్నారు.
అర్హులైన ఓటర్లకు గుర్తింపు కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై పరిమితి విధించారు
ఓటర్లను ప్రలోభపెట్టడం, ఓటుకు నోటు ఇవ్వడం వంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపారు.
ఎన్నికల సమయంలో మద్యం పంపిణీపై కన్నేశారు
ఎన్నికల ప్రచారంలో అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ వాహనాలను ఉపయోగించడాన్ని నిలువరించారు.
కులం, మతం ఆధారంగా ఓటు వేయవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఆలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడాన్ని నిలుపు చేశారు.
ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారంలో లౌడ్‌ స్పీకర్లు వినియోగించడాన్ని నిషేధించారు.

చివరి నిమిషంలో ఎన్నికలు రద్దు
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించకూడదన్న నిబంధన శేషన్‌ హయాంలో వచ్చినదే. రాజకీయ పార్టీలు శిబిరాలు ఏర్పాటుకు అధికారుల అనుమతి అవసరమైంది. మధ్యప్రదేశ్‌లోని ఒక నియోజకవర్గంలో అప్పటి గవర్నర్‌ తన తనయుడి తరఫున ప్రచారం చేయడంతో శేషన్‌ అక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. కొన్ని గంటల్లో పోలింగ్‌ మొదలవుతుందనగా… పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయడం శేషన్‌ సంచలన నిర్ణయాల్లో ఒకటి.
ప్రమోషన్‌… డిమోషన్‌
1988లో రాజీవ్‌ హయాంలో రక్షణ శాఖ కార్యదర్శిగా నియమితులవడంతో శేషన్‌ పేరు రాజకీయ వర్గాల్లో మారుమోగింది. బోఫోర్స్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ ప్రయోజనాలను కాపాడేందుకు ఆయన ప్రయత్నించారని అంటారు. 1989 మార్చిలో కేబినెట్‌ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఏడు నెలల తర్వాత అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ ఆయనను ప్రణాళికా సంఘం సభ్యుడిగా ‘డిమోట్‌’ చేశారు. ఆ తర్వాత చంద్రశేఖర్‌… 1990 డిసెంబరులో శేషన్‌ను ఈసీ అధిపతిగా నియమించారు.

Check Also

రాజస్థాన్ రాష్ట్రంలో మిడతల దండు దాడి

Share this on WhatsAppరాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జిల్లాపై మిడతల దండు దాడి చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బార్మేర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *