Breaking News
Home / States / Andhra Pradesh / ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌ను లోకల్‌గా మార్చేస్తున్న ముఠా

ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌ను లోకల్‌గా మార్చేస్తున్న ముఠా

ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌ను లోకల్‌గా మార్చేస్తున్న ముఠా
ఈజీ మనీ కోసం అక్రమాలు
రట్టు చేసిన రైల్వేకోడూరు పోలీసులు
ఐదుగురు అరెస్ట్‌, చైనా పరికరాలు సీజ్‌
వందల సంఖ్యలో సిమ్‌కార్డులు స్వాధీనం

రైల్వేకోడూరు రూరల్‌: ఈజీ మనీకి అలవాటుపడ్డారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ముఠా గుట్టును రట్టు చేసిన కడప జిల్లా రైల్వేకోడూరు పోలీసులు ఐదుగురు యువకులను శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ కేసు వివరాలను రాజంపేట డీఎస్పీ మురళీధర్‌ మీడియాకు వివరించారు. ఓబులవారిపల్లె మండలం చిన్నరాజుపోడుకు చెందిన నాగోలు నరసింహ(33) రైల్వేకోడూరులో సోని కమ్యూనికేషన్స్‌ అనే సెల్‌ఫోన్‌ షాపు నిర్వహించేవాడు. ఇతనికి అనంతరాజుపేటకు చెందిన మద్దిశెట్టి విజయ్‌కుమార్‌(33), రంగనాయకులపేటకు చెందిన కోడూరు వెంకటరమణ(30), వై.కోట గ్రామానికి చెందిన తోట మధుకుమార్‌(30), తిరుపతికి చెందిన మేకల రాజేంద్ర(33) భాగస్వాములు. అంతా కలసి చైనా స్కైలైన్‌ వీవోఐపీ (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ రూటింగ్‌ కాల్స్‌) పరికరం ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చి అక్రమంగా సంపాదించడం మొదలుపెట్టారు.

చైనా పరికరాన్ని షాపులోనే అమర్చి విదేశాల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చి నిమిషానికి పది పైసల నుంచి 30పైసలు మాత్రమే చార్జ్‌ అయ్యేలా చేసేవారు. సాధారణంగా ఇలాంటి ఫోన్‌ కాల్స్‌కు రూ.10 నుంచి రూ.15 చార్జ్‌ పడుతుంది. వీరు చేసిన పనివల్ల దేశీయ టెలీకాం సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు సంఘ విద్రోహులు, టెర్రరిస్టులు మాట్లాడుకునే వివరాలు తెలియక దేశభద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఏర్పడింది. సుమారు 425 సిమ్‌ కార్డులను తప్పుడు ఆధార్‌కార్డుల ద్వారా యాక్టివేట్‌ చేసుకొని అక్రమార్జనకు తెర తీసినట్లు డీఎస్పీ తెలిపారు. నాలుగు నెలలుగా ఈ దందా నడుస్తుందన్నారు.

ఇలా బయటపడింది!
అమెరికాలో ఉన్న ఓ ఎన్‌ఆర్‌ఐ తన తండ్రికి ఫోన్‌ చేయగా వీరు దానిని లోకల్‌కాల్‌గా మార్చారు. కుమారుడు అమెరికాలో ఉన్నప్పటికీ లోకల్‌ కాల్‌గా ఫోన్‌ రావడంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఏ నెట్‌వర్క్‌ నుంచైనా వచ్చే అంతర్జాతీయ కాల్స్‌ను వీరు లోకల్‌ కాల్స్‌గా మార్చేసేవారు. ఈ ఐదుగురిపై ఐపీసీతోపాటు సైబర్‌, టెలీగ్రాఫ్‌ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ల్యాప్‌టాప్ లు, చైనా రూటింగ్‌ గేట్‌వే పరికరం, వందల సంఖ్యలో సిమ్‌కార్డులు, ప్రింటర్‌, ఇంటర్నెట్‌ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గ్రే కాల్స్‌తో బురిడీ
‘ఫోన్‌ కాల్స్‌లో బ్లాక్‌ కాల్స్‌, వైట్‌ కాల్స్‌, గ్రే కాల్స్‌ అని 3 రకాలు ఉంటాయి. వీటిలో బ్లాక్‌ కాల్స్‌ కింద మాట్లాడుకుంటే రెండు వైపులా కాల్స్‌ రికార్డు కావు. నంబర్లు కనిపించవు. వైట్‌ కాల్స్‌ అయితే రెండు వైపులా కాల్స్‌ రికార్డయ్యి నంబర్లు కనిపిస్తాయి. గ్రే కాల్స్‌లో ఇంటర్నేషనల్‌ కాల్‌ వచ్చినా అది లోకల్‌ నంబర్‌గా నమోదవుతుంది. ఇలాంటి గ్రే కాల్స్‌ ద్వారానే నిందితులు అక్రమార్జనకు తెరతీశారు’ అని డీఎస్పీ వివరించారు.

Check Also

హుజూర్ నగర్ లో 144 సెక్షన్….

Share this on WhatsAppసూర్యాపేట: హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ప్రచార గడువు శనివారం సాయంత్రం 5గంటలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *