Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రాష్ట్రంలో సీబీఐకి ‘నో ఎంట్రీ’ చూపడం చట్ట సమ్మతమే :హైకోర్టు

రాష్ట్రంలో సీబీఐకి ‘నో ఎంట్రీ’ చూపడం చట్ట సమ్మతమే :హైకోర్టు

సీబీఐని అనుమతించాలా, వద్దా అనేది రాష్ట్రం ఇష్టం
డీఎస్‌‌‌‌‌‌పీఈ చట్టంలోనే ఆ స్పష్టత
జీవో 176 చట్ట సమ్మతమే
ఈ వ్యాజ్యంలో ప్రజాహితం లేదు
తేల్చి చెప్పిన ధర్మాసనం
ప్రాథమిక దశలోనే పిల్‌ కొట్టివేత
హైదరాబాద్‌: రాష్ట్రంలో సీబీఐకి ‘నో ఎంట్రీ’ చూపడం చట్ట సమ్మతమేనని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐని అనుమతించడం, అనుమతించకపోవడం రాష్ట్రానికి ఉన్న అధికారమని తెలిపింది. సీబీఐకి ‘జనరల్‌ కన్సెంట్‌’ను ఉపసంహరించుకుంటూ జారీ చేసిన జీవో 176ను ధర్మాసనం సమర్థించింది. సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు, అక్రమార్కులను రక్షించేందుకే ఇటువంటి జీవో తెచ్చారని, దీనిని రద్దు చేయాలని కోరుతూ ‘ఫోరం ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ, మరో రెండు సంస్థలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేసింది. చీఫ్‌ జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీచేసింది. ‘‘ఢిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లి్‌షమెంట్‌ (డీఎస్‌‌‌‌‌‌పీఈ) యాక్టు 1946లోనే ఉంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం ఏదైనా రాష్ట్ర పరిధిలో సీబీఐ దర్యాప్తు చేయాలంటే… ఆ రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి పొందాల్సిందే! అనుమతించడం లేదా అనుమతి నిరాకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.

చట్టాలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం జీవో 176ను జారీ చేసింది. అందువల్ల ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని భావిస్తే… ఆ విషయం చూసేందుకు కోర్టులు ఉన్నాయి అని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద సుప్రీంకోర్టును, ఆర్టికల్‌ 226 కింద హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. ఇటువంటి కేసుల్లో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదని గుర్తుచేసింది. మీడియా కథనాల ఆధారంగా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించలేమని తేల్చి చెప్పింది. అవే కథనాల్లో నేర తీవ్రత ఆధారంగా అవసరమైతే కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు కూడా ఉందని గుర్తుచేసింది. ‘కోర్టులు సీబీఐ విచారణకు ఆదేశించరాదు’ అని జీవోలో ఎక్కడా లేదని ధర్మాసనం తెలిపింది.

ఈ వ్యాజ్యంలో పిటిషనర్‌ సంస్థ తరపున న్యాయవాది డీవీ రావు వాదించారు. సీబీఐ దాడుల్ని అడ్డుకునే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేవన్నారు. డీఎ్‌సపీఈ యాక్టు ప్రకారం సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుచెప్పడం సరికాదన్నారు. సీబీఐని అడ్డుకుంటూ గతంలో కేరళ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అక్కడి హైకోర్టు కొట్టివేసిందన్నారు. జగన్‌పై దాడి కేసు, ఓటుకు నోటు కేసు, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి పై ప్రతిపక్షాలు సీబీఐ విచారణ కోరుతున్నాయన్నారు. ఈ దశలో ధర్మాసనం కల్పించుకుని… జగన్‌పై దాడికేసు తమ ముందు విచారణలో ఉందని గుర్తు చేసింది. ‘‘కేంద్ర ప్రభుత్వం గొప్పదా… రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా అని మేం చెప్పలేం. పరిపాలనే గొప్పది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదు. కోర్టు పరిశీలనకు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసుకు వర్తించదు’’ అని స్పష్టం చేస్తూ ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే కొట్టివేసింది.

Check Also

వర్షపాతం లోటును పెథాయ్‌ తీర్చింది: చంద్రబాబు

Share this on WhatsAppకాకినాడ: సీజన్‌ చివర్లో వర్షాలు పడలేదు.. తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆందోళన చెందామని, అయితే వర్షపాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *