బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూల్చడంతో పాటు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకుడిగా వ్యవహరించిన బెళగావి జిల్లా గోకాక్ మాజీ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళికి ఐటీ షాక్ ఇచ్చింది. రమేష్ జార్కిహోళి కుటుంబీకులకు బెళగావితో పాటు మహారాష్ట్రలోనూ చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇలా ఆయన పర్యవేక్షణలోని సౌభాగ్య షుగర్స్ కంపెనీకి అనుబంధంగా 34 మంది పేర్లతో రూ.105.61 కోట్ల మేర బినామీ ఆస్తులను ఐటీ శాఖ గుర్తించినట్లు సమాచారం.
షుగర్స్ ఫ్యాక్టరీలో పెట్టుబడులకు సంబంధించి ఐటీ విచారణ జరిపి బినామీ ఆస్తులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అదే రీతిన రమేష్ ఇరువురు కుమారులు, భార్య పేరిట కూడా ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఐటీ విచారణలలో 10 సహకార సంఘాలకు సంబంధించి విచారణ జరుపగా వీటిలో 8 సంఘాలు అస్తిత్వంలోనే లేనట్లు వెలుగులోకి వచ్చిం ది. వాస్తవానికి సౌభాగ్య షుగర్స్ సంస్థ బినామీ అని ఐటీ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఐటీ విచారణలు కొనసాగుతుండటంతో ఇంకా ఎన్ని బినామీ ఆస్తులు వెలుగులోకి వస్తాయో అనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుండటంతో పాటు మరికొన్ని రోజులలోనే కమలం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైన రమేష్ జార్కిహోళిపై ఐటీ దాడి సర్వత్రా చర్చకు కారణమవుతోంది.