జమ్మూ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి సంబరాలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి సైనిక దళాలతో ఆయన సంతోషంగా గడిపారు. సైనికులకు మిఠాయిలు తినిపించారు.
ఆదివారం ఇన్ఫాంట్రీ (పదాతి దళం) దినోత్సవాలను కూడా నిర్వహించారు. పాకిస్థాన్ మద్దతుతో జమ్మూ-కశ్మీరులోకి చొరబడినవారిని తరిమి కొట్టేందుకు 1947లో భారతీయ దళాలు ఆ రాష్ట్రంలో అడుగు పెట్టిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు.
మోదీ స్వయంగా సైనికులకు మిఠాయిలు తినిపించారు. వారితో కరచాలనం చేసి, అభినందించారు.
దీపావళి పండుగను ధైర్యవంతులైన భారత సైనికులతో జరుపుకున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ధైర్యవంతులతో మాట్లాడటం చాలా సంతోషకరమని తెలిపారు. మహత్తర సేవలు అందిస్తున్న సైనికులకు భారత దేశ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపానని పేర్కొన్నారు. వారి అప్రమత్తత, శౌర్యపరాక్రమాలు మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతాయన్నారు. సైనికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించి చెప్పినట్లు తెలిపారు.
సైనికుల శౌర్య, పరాక్రమాలు, ధైర్యసాహసాలకు సంబంధించిన కథలు అందరికీ తెలుసునని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వీరు అందజేసే అద్భుత సేవల గురించి మీకు తెలుసా? అని ప్రజలను అడిగారు. సైనికులు అత్యంత వేగంగా స్పందించి, అందజేసే సేవలు చాలా మంది ప్రాణాలను కాపాడుతున్నట్లు, ప్రజల ఆస్తులు ధ్వంసం కాకుండా నిరోధిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ రాజౌరీ నుంచి పఠాన్కోట్ వాయు సేన వైమానిక స్థావరానికి వెళ్ళారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సిబ్బంది, వైమానిక యోధులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.