Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జగన్‌ సర్కార్‌ ఓవర్‌ డ్రాఫ్ట్‌కి వెళ్లక తప్పలేదు…?

జగన్‌ సర్కార్‌ ఓవర్‌ డ్రాఫ్ట్‌కి వెళ్లక తప్పలేదు…?

తొలిసారి ఓవర్‌ డ్రాఫ్ట్‌కు సర్కారు..
భరోసా కోసం ఆర్బీఐ నుంచి 800 కోట్లు
బాండ్ల వేలం ద్వారా రూ.వెయ్యి కోట్లు..
వేస్‌ అండ్‌ మీన్స్‌తో 1510 కోట్లు
సెప్టెంబరులో 450 కోట్లు తగ్గిన ఆదాయం..
ఆర్థికంగా అష్టకష్టాలు
అమరావతి: ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లకూడదు’ అనే ఒట్టు తీసి గట్టున పెట్టేశారు. ‘రైతు భరోసా’కు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో… తప్పనిసరి పరిస్థితుల్లో ఓడీకి వెళ్లి రూ.800 కోట్లు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ నుంచి వేస్‌ అండ్‌ మీన్స్‌ (చేబదులు) ద్వారా నిధులు సమకూర్చుకోవడం సాధారణంగా జరిగేదే. ఇలా తెచ్చుకున్న నిధులను 3 పని దినాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక… ఆర్థికంగా అత్యవసరమై, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఓడీకి వెళతారు. గత ప్రభుత్వం చేబదులు, ఓడీ వెసులుబాటును పలుమార్లు ఉపయోగించుకుంది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ దీనిని తప్పుపట్టారు. తాను అధికారంలోకి వచ్చాక.. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడీకి వెళ్లకూడదు. అందుబాటులో ఉన్న నిధులతోనే నడపాలి’’ అని ఆర్థిక శాఖ అధికారులకు గట్టిగా చెప్పారు. అధికారులు కూడా.. వేతనాలు, పెన్షన్లు ఆలస్యమైనా, పెండింగ్‌ బిల్లులు గుట్టల్లా పేరుకుపోతున్నా, బ్యాంకుల నుంచి అప్పు పుట్టనప్పటికీ నాలుగున్నర నెలల పాటు ఓడీకి వెళ్లకుండా రాష్ట్రాన్ని నడిపారు. కానీ, రైతు భరోసా నిధుల కోసం చేసిన పోరులో మాత్రం ఓడిపోయారు. మొదటి విడత నిధులు ఇచ్చేందుకు జగన్‌ సర్కార్‌ ఓవర్‌ డ్రాఫ్ట్‌కి వెళ్లక తప్పలేదు. మంగళవారం రూ.800 కోట్లు ఆర్‌బీఐ నుంచి ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వినియోగించుకుని తెచ్చారు.

అన్ని మార్గాల్లో…
రైతు భరోసాకు నిధులు సమకూర్చేందుకు అధికారులు అన్ని మార్గాల్లో ప్రయత్నించారు. మంగళవారం ఆర్‌బీఐలో బాండ్ల వేలం ద్వారా రూ.వెయ్యి కోట్లు సాధించారు. దీనిపై వడ్డీ 7.17 శాతం నమోదైంది. వేస్‌ అండ్‌ మీన్స్‌ ద్వారా రూ.1510 కోట్లు తెచ్చుకున్నారు. ఓవర్‌ డ్రాఫ్ట్‌ నిధులు రూ.800 కోట్లతో కలిపి మంగళవారం రైతు భరోసా కోసం ఆర్థిక శాఖ రూ.3000 కోట్లను ఆర్టీజీకి విడుదల చేశారు.

తగ్గిన ఆదాయం
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం ఈ ఏడాది రూ.32,000 కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి రాష్ట్రం సమీకరించుకోవచ్చు. ఇందులో రూ.29,000 కోట్ల సమీకరణకు కేంద్రం అనుమతించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.23 వేల కోట్ల రుణం తీసుకుంది. ఇంకా రూ.6,000 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు… గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే రాష్ట్ర ఆదాయం రూ.450 కోట్లు తగ్గిపోయింది. నిరుడు సెప్టెంబరులో రూ.5,250 కోట్ల ఆదాయం రాగా… ఈసారి రూ.4,800 కోట్లకు పరిమితమైంది. దేశమంతా ఇదే పరిస్థితి ఉందని, ఆర్థిక మాంద్యం వల్ల జీఎస్టీ కూడా తగ్గుతోందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబరులో రిజిస్ర్టేషన్ల ఆదాయంతో పాటు, జీఎస్టీ కూడా తగ్గిందని తెలిపారు. రాష్ట్ర ఆదాయంపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతి నెలా 10, 11 తేదీల్లో సమీక్ష జరుపుతున్నారు. ఈ నెల ఇంకా సమావేశం నిర్వహించలేదు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *