Breaking News
Home / National / కేరళకు యూఏఈ సాయం.. కేంద్రం తిరస్కరించడానికి కారణాలివేనా?

కేరళకు యూఏఈ సాయం.. కేంద్రం తిరస్కరించడానికి కారణాలివేనా?

న్యూఢిల్లీ: వరద కోరల్లో చిక్కుకున్న కేరళ కోసం విదేశాలు ప్రకటించిన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించనున్నట్టు సమాచారం. రాష్ట్ర పునర్నిర్మాణం, బాధితులకు పునరావాసం కోసం భారత్‌కు తోడ్పడేందుకు సిద్ధమని యూఏఈ, ఖతార్, మాల్దీవులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశాలు ప్రకటించిన సాయం పట్ల పూర్తి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నప్పటికీ… తన సొంత నిధులతోనే కేరళను పునర్నిర్మించాలని భారత్ భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రపంచం నలుమూలల నుంచి వ్యక్తిగతంగా పంపిస్తున్న విరాళాలకు, విదేశాల్లో స్థిరపడిన కేరళ వాసులకు ప్రభుత్వం ఎలాంటి అడ్డూ చెప్పడంలేదు.

యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ కేరళకు రూ. 700 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించారు. దుబాయ్, కేరళ మధ్య అనుబంధానికి… భారత్-యూఏఈ మధ్య సన్నిహిత సంబంధాలకు ప్రతీకగా అందరూ దీన్ని భావించారు. ప్రధాని మోదీ యూఏఈ అధినేతకు ట్విటర్లో కృతజ్ఞతలు చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా యూఏఈకి కృతజ్ఞతలు చెప్పారు. ఖతార్ దాదాపు రూ.35 కోట్లు ఆఫర్ చేయగా.. ఇటీవల భారత్‌తో స్నేహం కలుపుకున్న మాల్దీవులు కూడా 50 వేల డాలర్లు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కాగా ఐక్య రాజ్య సమితి సాయం అర్ధించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ నేత శశిథరూర్ సైతం జెనీవా వెళ్లారు. అయితే ఇవన్నీ ఆచరణ సాధ్యం అయ్యేట్టు కనిపించడం లేదు. ఇంకా భారత్ నుంచి ఎలాంటి అభ్యర్థన రాకపోవడమే దీనికి కారణం.

విదేశాల నుంచి సాయం తీసుకోరాదన్న భారత విధానం కొత్తేం కాదు. 2013 ఉత్తరాఖండ్ వరదల సమయంలోనూ అప్పటి యూపీఏ ప్రభుత్వం విదేశాల సాయాన్ని సున్నితంగా తిరస్కరించింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విదేశాల సాయం తీసుకోరాదని 2004 సునామీ సమయంలో భారత్ దీర్ఘకాలిక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎలాంటి విపత్తులనైనా తట్టుకుని నిలబడగల సామర్థ్యం మన దేశానికి ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేయడమే దీని లక్ష్యం. ఈ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నందునే తాజాగా విదేశాలు ప్రకటించిన సాయాన్ని కేంద్రం తిరస్కరించనున్నట్టు తెలుస్తోంది.

Check Also

షిర్డీలో మహిళకు అవమానం: పోలీసులకు ఫిర్యాదు

Share this on WhatsAppషిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీసాయిబాబా ఆలయంలో ఒక మహిళను వేధింపులకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది. మందిరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *