పూణె : టీమిండియా సారథి విరాట్ కోహ్లీ (254*; 336 బంతుల్లో 33×4, 2×6) తన రికార్డులను తానే బద్దలు కొట్టేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తన అత్యధిక స్కోరు 243ను దాటేశాడు. సెనురాన్ ముత్తుసామి వేసిన 154.4వ బంతిని బౌండరీకి తరలించి టెస్టుల్లో అత్యధిక పరుగుల మైలురాయిని అధిగమించాడు. భారత్‌కు సారథ్యం వహించిన అందరిలోనూ ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మరో ఆటగాడు రవీంద్ర జడేజా (91; 104 బంతుల్లో 8×4, 2×6) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ముత్తుసామి వేసిన 156.3వ బంతిని ఆడిన జడ్డూ డిబ్రూన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే కోహ్లీ తన త్రిశతకం గురించి ఆలోచించకుండా 601/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అతడి సారథ్యంలో భారత్ 600 స్కోరు చేయడం ఇది పదోసారి కావడం గమనార్హం.
