Breaking News
Home / States / Andhra Pradesh / ఎంపీడీవో ఇంటిపై దాడి కేసులో.. కోటంరెడ్డి అరెస్టు

ఎంపీడీవో ఇంటిపై దాడి కేసులో.. కోటంరెడ్డి అరెస్టు

వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి కూడా..
తెల్లవారుజామన హైడ్రామా..
మొబైల్‌ కోర్టులో హాజరు
సొంత పూచీకత్తుపై ఇద్దరికీ బెయిల్‌
ఎంపీడీవోతో ఓ వైసీపీ నేత కేసు పెట్టించారు..
వెనుక పెద్ద తలకాయలు: కోటంరెడ్డి
నెల్లూరు, అమరావతి: నెల్లూరులో ఆదివారం వేకువజామున హైడ్రామా చోటుచేసుకుం ది. నాటకీయ పరిణామాల నడుమ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి తన ఇంటిపై దాడిచేశారని, దౌర్జన్యం చేశారని వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడి చిల్డ్రన్స్‌ పార్కు సమీపంలోని కోటంరెడ్డి ఇంటికి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం అర్ధరాత్రే వెళ్లారు. ఎమ్మెల్యే నిద్రపోతున్నారని కుటుంబ సభ్యులు సమాధానమిచ్చారు. దీంతో వెంకటాచలం ఎస్సైని రాత్రంతా అక్కడ ఉంచి డీఎస్పీ బృందం వెనుదిరిగింది. అనంతరం వేకువజామున 5:15 గంటలకు రూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి నేతృత్వంలో పోలీసుల బృందం కోటంరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన్ను అరెస్టు చేశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని తప్పించి నేరుగా ఆయన్ను నెల్లూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా.. శ్రీకాంత్‌రెడ్డి కోసం కూడా పోలీసులు శనివారం అర్ధరాత్రే నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లగా అక్కడ లేరు. ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు. కోటంరెడ్డికి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో శ్రీకాంత్‌రెడ్డి నేరుగా అక్కడకు వచ్చి పోలీసులకు లొంగిపోయారు. శ్రీకాంత్‌రెడ్డికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాక ఇద్దరినీ రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని మొబైల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలపై నమోదుచేసిన ఐపీసీ సెక్షన్లు 290, 427, 448, 506.. బెయిలబుల్‌ సెక్షన్లు కావడంతో న్యాయమూర్తి వెంటనే బెయిల్‌ మంజూరు చేశారు.

నాపై అసత్య ఆరోపణలు: ఎమ్మెల్యే
ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ పోలీసులకు సూచించడం అభినందనీయమని కోటంరెడ్డి పేర్కొన్నారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, ఎంపీడీవో సరళ తనపై అసత్య ఆరోపణలతో పోలీసు కేసు పెట్టారని ఆరోపించారు. బెయిల్‌పై విడుదలయ్యాక ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వయంగా వెంకటాచలం మండల వైసీపీ నాయకుడు ఎంపీడీవో సరళ వెంట ఉండి కేసు పెట్టించారని, ఆయన వెనుక పెద్ద తలలున్నాయని ఆరోపించారు. తనపై కక్ష తీర్చుకునేలా ఎస్పీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ జరిపించాలని సీఎంను కోరారు. తాను తప్పు చేసినట్లు రుజువైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని సూచించారు.

దాడిపై విచారణ హర్షణీయం: ఏపీజేఏసీ
నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళపై దాడి సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించిన సీఎం జగన్‌కు అమరావతి ఏపీ జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. ఘటనపై విచారణకు వెనువెంటనే ఆదేశాలిచ్చి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులను అరెస్టు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు ఎదురైనప్పుడు వెనువెంటనే చర్యలు తీసుకుంటే వారు ధైర్యంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా తమ విధులు నిర్వర్తించడమే కాకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి పేర్రాజు అభిప్రాయపడ్డారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *