న్యూఢిల్లీ : జామియా మిలియాలో పోలీసుల దాష్టీకానికి నిదర్శనంగా నిలిచే మరో సిసిటివి ఫుటేజ్ వెలుగుచూసింది. విద్యార్ధులపై రెండు నెలల క్రితం పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగతి తెలిసిందే. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా డిసెంబరు 15న విద్యార్ధులు నిరసనలు నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్ధులు తమపై రాళ్ళు రువ్వారని, బస్సులకు నిప్పు పెట్టారని పోలీసులు ఆరోపిస్తూ లాఠీఛార్జి చేయడంతో నిరసన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అనంతరం పోలీసులు కాలేజి లైబ్రరీలోకి ప్రవేశించి ఆందోళనతో సంబంధం లేని విద్యార్ధులను చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ దృశ్యాలకు సంబంధించిన మరో వీడియోను శనివారం విద్యార్ధులు విడుదల చేశారు. దాదాపు 44 సెకండ్లు నిడివి కలిగిన ఈ వీడియోలో పోలీసులు లైబ్రరీలోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో లైబ్రరీలో 10 నుండి 20 మంది విద్యార్ధులు ఉన్నారు. పోలీసులు వారిపై లాఠీఛార్జీ చేస్తూ లైబ్రరీ వెలుపలకు తోసేశారు. ఈ వీడియోను జామియా సమన్వయ కమిటీ ట్విట్టర్లో షేర్ చేసింది. కాలేజిలోని పాత రీడింగ్ హాల్లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్న ఎం.ఎ, ఎంఫిల్ సెక్షన్లో డిసెంబరు 15న జరిగినట్లు ట్విట్టర్లో పేర్కొంది. ఇది ఢిల్లీ పోలీసులు సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్యానించింది. ఈ వీడియో లైబ్రరీ లోపలిదేనని జామియా అధికారులు ధ్రువీకరించినప్పటికీ, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వీడియోను సమగ్రంగా తనిఖీ చేసిన తరువాత దానిపై స్పందిస్తామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసులు అబద్ధం చెప్పారు : ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తాజాగా విడుదలైన వీడియోపై స్పందించారు. లైబ్రరీలో విద్యార్ధులపై లాఠీఛార్జీ విషయలో పోలీసులు, పాలకులు అబద్ధం చెప్పారని విమర్శించారు. తాజా వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ”చదువుకుంటున్న విద్యార్ధులపై పోలీసులు విచక్షణా రహితంగా ఎలా ప్రవర్తించారో చూడండి. తాను చదువుకుంటున్నట్లు ఒక విద్యార్ధి పుస్తకాన్ని చూపించినప్పటికీ, పోలీసులు అతనిపై లాఠీ ప్రయోగించారు. లైబ్రరీలోకి ప్రవేశించి ఎవరిపై లాఠీఛార్జి చేయలేదని పోలీసులు, హోం మంత్రి అబద్ధాలు చెప్పారు. ఈ వీడియో చూసిన తరువాత కూడా జామియాలో చోటుచేసుకున్న హింసపై చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రజలకు పూర్తిగా బహిర్గతమవుతుంది” అని ట్వీట్లో పేర్కొన్నారు.