అమరావతి: గుంటూరులో జరిగిన ‘ప్రజా చైతన్య సభ’ వేదికగా సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, టీడీపీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు రియాక్టయ్యి ఘాటు కౌంటర్ ఇవ్వగా.. తాజాగా నారా లోకేశ్ రియాక్టయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రధాని మోదీ… ఒకే ఒక్క సాక్ష్యాన్ని అయినా చూపించగలరా? అని మంత్రి నారా లోకేశ్ సూటి ప్రశ్న సంధించారు. ఆదివారం నాడు రేణిగుంటలో పది మోబైల్ పరిశ్రమలకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి నల్లచొక్కాతో లోకేశ్ పాల్గొన్నారు. కార్బన్ మొబైల్స్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్ కంటే మెండుగా ఏపీ అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు. ఇందుకు వివిధ ఇండెక్స్లే సూచికలన్నారు. ప్రత్యేకహోదా గురించి, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ లాంటి అంశాలపై మాట్లాడని మోదీ తన గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. తన బాల్యంలోనే తన తాత సీఎం అని తాను స్కూలుకు వెళ్లేటప్పటికీ తన తండ్రి సీఎం అని గుర్తు చేశారు. తాను విదేశాల్లో చదువుకుని రాష్ట్రానికి సేవ చేయాలనే అక్కడి ఉన్నత ఉద్యోగ జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
అదుకే రాహుల్‌తో కలుస్తున్నాం..
తాను మంత్రి అయి 22 నెలలు అయ్యిందని, తనకు అప్పగించిన గ్రామీణ అభివృద్ధిలో గానీ, ఐటీ శాఖలో గానీ తన పనితీరు తన గురించి చెబుతుందన్నారు. అహర్నిశలు కష్టపడి పని చేస్తుంటే.. కంపెనీలను తెచ్చుకుంటుంటే ప్రదాని స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం తగదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెపుతున్నారు కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలకు మోదీ అడ్డుకుంటున్నదున తాము కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు దృష్టి సారించాల్సి వచ్చిందని వివరించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని.. ఎదిరించి తీరుతామన్నారు.
మా వాటా మాకు రావాల్సిందే..
జాతీయస్థాయి పథకాలు ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రంలో అమలు అవుతున్నట్టు అమలు అవుతున్నయా? అని ప్రశ్నించారు. కేంద్రానికి పన్నులు కడుతున్నందున రాష్ట్రానికి రావాల్సిన వాటాగా వచ్చేవి మాత్రమే వస్తున్నాయని, వాటిని తామేదో ఇచ్చేస్తున్నట్టు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. మోదీ సభలకు వైసీపీ జనసమీకరణ చేయటం, ఆ రెండు పార్టీల తెరవెనుక డ్రామాకు నిదర్శనమన్నారు. శాంతియుతంగా నిరసన తెలపటం ప్రజాస్వామ్య హక్కు అని దాన్ని తెలుగుదేశం తప్పకుండా సమర్దిస్తుందని, మోదీ రాకపై జరుగుతున్న నిరసనలను ఉద్దేశించి మంత్రి లోకేశ్ అన్నారు.