భోపాల్(మధ్యప్రదేశ్): ప్రీ వెడ్డింగ్ షూట్‌పై వధూవరులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోని వధూవరులకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఒక సమస్యగా మారింది. మరుగుదొడ్ల నిర్మాణాలను మరింతగా పెంచేందుకు వరుడు తన ఇంటి టాయిలెట్ దగ్గర నిలుచుని ఫొటో తీయించుకోవాల్సివుంటుంది. అప్పుడే వధువుకు ముఖ్యమంత్రి కన్యా వివాహ్ పథకం కింద రూ. 51 వేల లబ్ధి అందుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు తప్పకుండా టాయిలెట్ దగ్గర వరుడు తీయించుకున్న ఫొటోను జత చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా బీఎంసీ అధికారి సీబీ మిశ్రా మాట్లాడుతూ పెళ్లికి 30 రోజుల మందుగా టాయిలెట్ నిర్మించాలనే నిబంధనకు సడలింపు ఇచ్చారన్నారు. అయితే టాయిలెట్ దగ్గర వరుడు ఫొటో తీయించుకుని దరఖాస్తుకు జత చేయాలనడంలో తప్పేమీ లేదన్నారు.
