Breaking News
Home / Crime / లలిత జువెలరీలో భారీ దోపిడీ

లలిత జువెలరీలో భారీ దోపిడీ

సినీ ఫక్కీలో తిరుచ్చి షోరూమ్‌కి కన్నం… రూ.13కోట్ల నగలు చోరీ
సినీ ఫక్కీలో తిరుచ్చి షోరూమ్‌లోకి చొరబడ్డ దొంగలు
సీసీకెమెరాలో ఇద్దరు.. ముఖానికి జంతువుల మాస్క్‌లు
2 గంటల్లోనే లూటీ.. వారికోసం 7 పోలీస్‌ బృందాలు
చెన్నై: షోరూమ్‌ వెనుక వైపు గోడకు కన్నం వేశారు. పిల్లలు ఆడుకొనే జంతువుల మాస్క్‌లు పెట్టుకొని సీసీ కెమెరాల కన్ను కప్పారు. అమ్మకాల కోసం బ్యాక్సుల్లో ఉంచిన బంగారం, వజ్రాలు మూటగట్టుకొన్నారు. ఇద్దరు అగంతకులు మొత్తం రెండు గంటల్లోపే రూ. 13 కోట్ల విలువైన ఆభరణాలతో ఉడాయించారు. తమిళనాడులోని తిరుచ్చిలోని లలిత జువెలరీ షోరూమ్‌లో అత్యంత సినీఫక్కీలో బుధవారం తెల్లవారుజామున ఈ భారీ దోపిడీ జరిగింది. గత కొన్నేళ్లలో తమిళనాడులో జరిగిన అతి పెద్ద చోరీ ఇదే. విషయం తెలిసిన వెంటనే లలిత జువెలరీ అధినేత కిరణ్‌కుమార్‌ తిరుచ్చికి వెళ్లి, షోరూమ్‌ను పరిశీలించారు. బంగారు నగలతోపాటు వజ్రాలు, ప్లాటినంతో తయారుచేసిన ఆభరణాలు చోరీకి గురయినట్టు గుర్తించారు. పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక పోలీసు బృందాలు నియమితమయ్యాయి. కిరణ్‌కుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. తిరుచ్చి సత్రం బస్టాండు సమీపంలో ఉన్న లలిత జువెలరీ షోరూమ్‌ని రోజూలాగానే బుధవారం ఉదయం తెరిచారు. షోరూమ్‌ లోపల ఖాళీగా ఆభరణ బాక్సులు కనిపించేసరికి నిర్వాహకులు, సిబ్బంది దిగ్ర్భాంతికి గురయ్యారు. వెంటనే తిరుచ్చి నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుచ్చి నగర జాయింట్‌ పోలీసు కమిషనర్‌ మయిల్‌వాహనన్‌ సారథ్యంలో పోలీసుల బృందం అక్కడకు చేరుకుని విచారణ చేపట్టింది. ఆధారాల కోసం ఫోర్సెన్సిక్‌ నిపుణులు చోరీ జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. పరిసర ప్రాంతాల్లో జాగిలాలతో తనిఖీ చేశారు. షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా వేకువజామున 2.30 నుండి ఉదయం 4.30 గంటల మధ్య షోరూమ్‌లో రెండు అగంతకులు ఉన్నట్టు గుర్తించారు. అయితే, వారు తమ చేతి వేలిముద్రలు దొరకకుండా జాగ్రత్తపడ్డారు. దోచుకున్న నగలను ఏ మార్గంలో, ఏ వాహనంలో తరలించారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే షోరూమ్‌లో పనిచేస్తున్న 160 మందికిపైగా సిబ్బంది వద్ద కూడా విచారణ జరుపుతున్నారు.

అప్పుడూ ఇలాగే..
గతేడాది తిరుచ్చి 1వ నంబరు టోల్‌గేట్‌ సమీపంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కూ ఇదే రీతిన కన్నం వేయడం గమనార్హం. అప్పుడూ బ్యాంకు గోడకు కన్నం వేసి అగంతకులు లోపలకు ప్రవేశించారు. లాకర్‌లోని రూ.5 కోట్ల విలువైన నగలను అపహరించారు. ఆ ఘటన, లలిత జ్యువెలర్స్‌లో దోపిడీ జరిగిన విధానం ఒకేలా ఉన్నాయని, ఆ అగంతకులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా తమిళనాడులోని తేని జిల్లాలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో 280 సవర్ల నగలు, నగదును అగంతకులు దోచుకొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *