లక్నో : కాంగ్రెస్ తీరును బహుజన్ సమాజ్ పార్తీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీవ్రంగా ఎండగట్టారు. ఉత్తర ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మాదిరిగానే మధ్య ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ రెండు ప్రభుత్వాలు ఓ రకంగా భయపెట్టే విధంగా పరిపాలిస్తున్నాయన్నారు.
ఆమె వ్యాఖ్యలకు ఆధారంగా ఇటీవలి పరిణామాలను గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం విద్యార్థులు 14 మందిపై దేశద్రోహం కేసులు నమోదు చేసిందని, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం గో వధ ఆరోపణలపై కొందరిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులు పెట్టిందని అన్నారు. ఈ రెండు పరిణామాలు ఈ ప్రభుత్వాల భయపెట్టే విధానాలకు నిదర్శనమని, ఖండించదగినవని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య తేడా ఏమిటో ప్రజలు తెలుసుకోవాలన్నారు.