పూణె: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్రలోని పూణెలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూణెలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘ఐకమత్యంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఎంతో బలం ఉంటుంది. దేశ ప్రజలందరూ ప్రస్తుతం దీని గురించే మాట్లాడుకుంటున్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ల భవిష్యత్తును మార్చడానికి ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఇదంతా మీ సహకారం వల్లే జరిగింది’ అని మాట్లాడుతూ వేదిక మీద నుంచి పక్కకు వచ్చి ప్రజలకు రెండు సార్లు వంగి అభివాదం చేశారు. దీంతో సభాప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఈ వీడియోను ఓ ప్రముఖ వార్తా సంస్థ ట్విటర్లో పంచుకోవడంతో అది వైరల్గా మారింది. మోదీ వినయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
