Breaking News
Home / National / నెగ్గిన పంతం… అమిత్‌షా కు మోదీ అభినందన..

నెగ్గిన పంతం… అమిత్‌షా కు మోదీ అభినందన..

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
అర్ధరాత్రి దాటాక బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌
మద్దతు కోసం చక్రం తిప్పిన బీజేపీ
మాటల్లో నిరసించి చేతల్లో మద్దతిచ్చిన సేన
వాడివేడిగా పది గంటల సుదీర్ఘ చర్చ
మతంతో దేశాన్ని చీల్చింది కాంగ్రెస్సే
భారత ముస్లింలకు బిల్లు వ్యతిరేకం కాదు
హోం మంత్రి అమిత్‌ షా స్పష్టీకరణ
తీవ్రంగా నిరసించిన విపక్షాలు.. మతయుద్ధానికి దారితీస్తుంది: సేన
అమిత్‌షా కు మోదీ అభినందన..
విస్తృత చర్చ అనంతరం బిల్లును లోక్‌సభ ఆమోదించడం సంతోషకరం. బిల్లుకు మద్దతు ఇచ్చిన వివిధ పార్టీలు, ఎంపీలకు కృతజ్ఞతలు. శతాబ్దాలుగా వస్తున్న కలుపుకొనిపోవడమనే మన సంస్కృతికి, మానవీయ విలువల్లో మన నమ్మకానికి అనుగుణంగా ఈ బిల్లు ఉంది. హోం మంత్రి అమిత్‌ షాకు ప్రత్యేక అభినందనలు. ఈ బిల్లులోని అన్ని అంశాలనూ ఆయన స్పష్టంగా వివరించారు.

– ట్విటర్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దాదాపు పది గంటలపాటు తీవ్ర వాదోపవాదాలు, ఆరోపణల అనంతరం వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ సోమవారం రాత్రి ఆమోదించింది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు.. బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, అన్నాడీఎంకే, అసోం గణపరిషత్‌, శిరోమణి అకాలీదళ్‌తో పాటు ఈ మధ్యే దూరమైన శివసేన కూడా అనుకూలంగా ఓటు వేయడం విశేషం. కొద్ది గంటల కిందటే బిల్లుపై సర్కార్‌ను దునుమాడి అంతలోనే శివసేన తన వైఖరి మార్చుకుంది.

వైసీపీ, బీజేడీ, టీడీపీ లాంటి తటస్థ పక్షాలు సైతం బాసటగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర సమితి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. అమిత్‌ షా రాజకీయ మేనేజర్లు సభా సమన్వయం ప్రశంసనీయంగా చేశారనీ, విపక్ష శిబిరం సింబాలిక్‌గా మాత్రమే విభజన కోరిందని వ్యాఖ్యానాలు వినవచ్చాయి. బిల్లు ఆమోదంతో పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొనే ముస్లిమేతరులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆమోదించడానికి బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ మూడు దేశాల్లోని హిందువులు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఈ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి సరైన ట్రావెల్‌ డాక్యుమెం ట్లు, ఇతర పత్రాలు లేకపోయి నా.. వారు 2014 డిసెంబరు 31 లేదా అంతకుముందు భారత్‌కు వచ్చి ఉండాలి.

బిల్లు భారతీయ ముస్లింలకు ఏమా త్రం వ్యతిరేకం కాదని హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశా రు. ‘మోదీ ప్రభుత్వంలో ముస్లింలు భయపడాల్సిన పనిలేదు. ఇన్నేళ్లూ వారు ఎంత గౌరవంగా జీవించారో ఇక ముందూ అంతే గౌరవంతో స్వేచ్ఛగా జీవించవచ్చు’’ అని హామీ ఇచ్చారు. ‘‘త్వరలో జాతీయ పౌరుల చిట్టా (ఎన్‌ఆర్‌సీ)ను కూడా దేశవ్యాప్తంగా కచ్ఛితంగా అమలు చేస్తాం. ఇందులో సందేహం లేదు. ఎన్‌ఆర్‌సీ వస్తోంది.. సిద్ధంగా ఉండండి’’ అని ఆయన తేల్చిచెప్పారు. ‘‘ దేశంలో ముస్లింల జనాభా 1951లో 9.8% ఉంటే 2011లో 14.5%కు పెరిగింది. హిందువుల జనాభా స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 84ు నుంచి 79ుకు తగ్గింది. పాకిస్థాన్‌లో మైనారిటీల జనాభా 23% నుంచి 3.7%కు, బంగ్లాదేశ్‌లో 22% నుంచి 7%కు తగ్గింది’’ అని ఆయన లెక్కలు తీశారు. ‘‘ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు వ్యతిరేకం కాదు. ఏళ్ల తరబడి ఆ మూడు దేశాల్లో బాధలు పడ్డ వారికి ఊరట. వారు గౌరవంగా జీవించేందుకు ఓ అవకాశం’’ అన్నారు.

‘‘బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చే రోహింగ్యా ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఇచ్చే ప్రశ్నే లేదు. వారిని వారి దేశాలకు పంపేస్తాం’’ అని స్పష్టం చేశారు. ‘‘ఇది నెహ్రూ-లియాకత్‌ అలీ ఖాన్‌లు చేసిన తప్పిదాన్ని సవరించడమే. ఈ దేశాన్ని మతపరంగా విభజించడానికి నాటి వారి ఒప్పందమే ప్రాతిపదక అయ్యింది. నాడు నెహ్రూ చేసిన తప్పును మోదీ సవరిస్తున్నారు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది’’ అని బీజేపీ సభ్యుల హర్షధ్వానాల మధ్య షా అన్నారు.

శరణార్ధులు వేరు, చొరబాటుదారులు వేరు
అంతకుముందు బిల్లుపై చర్చతో లోక్‌సభ అట్టుడికిపోయింది. అమిత్‌ షా ఈ బిల్లును ప్రవేశపెట్టగానే నిరసన హోరెత్తింది. బిల్లు తెస్తున్నారని ముందే తెలుసుకు న్న కాంగ్రెస్‌ సభా నియమావళి రూల్‌ 72 కింద నోటీసు ఇచ్చి.. సమానత్వ హక్కును కాలరాసే ఈ బిల్లును ప్రవేశపెట్టరాదని కోరారు. దీనిపై రెండు గంటలపాటు సభ వాడివేడిగా సాగింది. చివరకు బిల్లును ప్రవేశపెట్టాలా.. వద్దా అనే అంశంపై ఓటింగ్‌ నిర్వహించారు. 293 ఓట్లు అనుకూలంగానూ, 82 ఓట్లు వ్యతిరేకంగానూ పడటంతో విపక్ష ప్రయత్నం వీగిపోయింది. ‘‘దేశాన్ని మతపరంగా విభజించినది కాంగ్రెస్‌ పార్టీయే! నాడు ఆ విభజన జరిగి ఉండకపోతే నేడీ బిల్లు తేవాల్సిన అవసరమే ఉండే ది కాదు. శరణార్థులు వేరు, చొరబాటుదారులు వేరు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొనే ముస్లిమేతరులు వేలల్లో ఉన్నారు. వారికి న్యాయం జరగాలి.

వారు భారత్‌కు కాక మరెక్కడికి పోతారు? ఈ మూడు దేశాలే ఎందుకంటే… ఇవి మనకు అతి సమీపంగా, దాదాపు కలిసిపోయినట్లుగా ఉన్న సరిహద్దులు గలవి, అంతకుమించి ఇవి మూడూ ఇస్లామిక్‌ దేశాలు. అక్కడ ముస్లింలకూ ఎటూ రక్షణ ఉంటుంది. మిగిలిన మతస్థులు ద్వితీయశ్రేణి పౌరులు. అందుకే హిందూ, క్రైస్తవ, బౌద్ధ, జైన, పార్శీ, సిక్కు మతస్థులకు పౌరసత్వం కల్పించాలని నిశ్చయించాం’’ అని బిల్లును ప్రవేశపెట్టే సమయంలో హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. బిల్లు రాజ్యాంగంలోని సమానత్వపు హక్కును విశదీకరించే 14వ అధికరణానికి వ్యతిరేకమనీ, ముస్లింలకు వ్యతిరేంగా తీసుకొచ్చినదనీ, ఓటుబ్యాంకు కోసమే ఈ బిల్లు తెచ్చారనీ కాంగ్రెస్‌, తృణమూల్‌, ఎస్పీ, ఎన్సీపీ, లెఫ్ట్‌ పార్టీలు ఆరోపించాయి. బిల్లు ఆమోదిస్తే మహమ్మద్‌ అలీ జిన్నా ప్రవచించిన ద్విజాతి సిద్ధాంతం కరెక్టనీ, గాంధీజీ కోరిన సిద్ధాంతాలు తప్పనీ తేలుతుందని శశి థరూర్‌ అన్నారు. ‘‘బిల్లుకు 130 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉంది. ఈ బిల్లును 2014లోనే మా మేనిఫెస్టోలో చేర్చాం. ప్రజలు మాకు అఖండ మెజారిటీ ఇచ్చారంటే బిల్లుకు ప్రజామోదం ఉన్నట్లే.

ఈ బిల్లు 0.001 శాతం కూడా మైనారిటీ-వ్యతిరేకం కాదు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు కూడా భంగం వాటిల్లదు. మణిపూర్‌ను కూడా ఇన్నర్‌ లైన్‌ ఆఫ్‌ పర్మిట్‌ వ్యవస్థ (ఐఎల్‌పీ)లో చేరుస్తున్నాం. అంటే అక్కడ కూడా రక్షిత ప్రాంతాల్లో ప్రవేశించడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి’’ అని అమిత్‌ షా చెప్పారు. బిల్లుపై విపక్షాల వ్యతిరేకతను తిప్పికొడుతూ ‘గతంలో 1971 యుద్ధం తరువాత బంగ్లాదేశ్‌ శరణార్థులకు ఇందిరాగాంధీ పౌరసత్వం కల్పించారు. ఆనాటి ఆమె చర్య రాజ్యాంగ విరుద్ధమా? 1985లో రాజీవ్‌గాంధీ అసొం ఒప్పందంపై సంతకం చేశారు. అది రాజ్యాంగ వ్యతిరేకమా? మేం హక్కుల్ని కలగజేస్తాం తప్ప లాగేసుకోం. ఈ హక్కులు కల్పించడం వల్లే గతంలో పాక్‌ నుంచి వచ్చి స్థిరపడ్డ డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ దేశ ప్రఽధాని కాగలిగారు. లాల్‌కృష్ణ ఆడ్వాణీ ఉప ప్రధాని కాగలిగారు. మాకు సంబంధించినంతవరకూ ఈ బిల్లులో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదు. ఉగ్రవాదం నీడ ఈ దేశంపై పడరాదన్న ఉద్దేశంతో బిల్లు తెచ్చాం. చొరబాటుదారుల ఏరివేతే లక్ష్యం’’ అని అమిత్‌ షా వివరించారు.

చట్టాన్ని అడ్డుకుంటాం: మమత
ఈ బిల్లు చట్టరూపు దాల్చాక ఆరునూరైనా తమ రాష్ట్రంలో అడ్డుకుంటామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. ‘తృణమూల్‌ అధికారంలో ఉన్నంతవరకూ ఎన్‌ఆర్‌సీ గానీ, పౌరసత్వ బిల్లును గానీ అమలు చేయనివ్వం. చట్టబద్ధమైన పౌరులను వెళ్లగొట్టం. వారిని శరణార్థులుగా మారనివ్వం’’ అని ఆమె స్పష్టం చేశారు.

కోర్టులో కాంగ్రెస్‌ సవాల్‌?
పౌరసత్వ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని కాంగ్రె్‌సలోని ఓ వర్గం కోరుతోంది. దీనిపై సీనియర్‌ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయాన్ని అసొం నుంచి ఎన్నికైన ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ మీడియాకు చెప్పారు. పార్లమెంటు గనక ఆమోదిస్తే పిటిషన్‌ వేసే విషయమై నిర్ణయం జరుగుతుందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులోని ఏ ధర్మాసనం కూడా ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును సమర్థించబోదని శశి థరూర్‌ అభిప్రాయపడ్డారు.

బయటకు కనబడని మత విభజన: శివసేన
బిల్లును వ్యతిరేకిస్తూనే శివసేన దానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. ఎంపిక చేసిన కొంతమంది హిందువులకు పౌరసత్వం కలిగిస్తే మతయుద్ధానికి దారితీస్తుందని శివసేన హెచ్చరించింది. ఈబిల్లు ద్వారా దేశంలోని హిందూ ముస్లింల మధ్య ‘బయటకు కనబడని విభజన’కు కేంద్రం తెగబడుతోందని ఘాటుగా విమర్శించింది. ‘‘బిల్లు ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడడం దేశ ప్రయోజనాలకు మంచింది కాదు. ముస్లింలను మినహాయించి మిగిలిన వారికి పౌరసత్వం కల్పించడం సరికాదు. బిల్లు తెస్తే అది మత యుద్ధానికి ట్రిగ్గర్‌ నొక్కినట్లే’’ అని సామ్నాలో రాసిన సంపాదకీయంలో శివసేన తీవ్రంగా అధిక్షేపించింది.

వ్యతిరేకం
కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఎన్‌సీ, ఆర్జేడీ, డీఎంకే, ఎంఐఎం, ఐయూఎంఎల్‌, టీఆర్‌ఎస్‌

అనుకూలం
బీజేపీ, జేడీయూ, వైసీపీ, అసొం గణపరిషత్‌, ఎన్‌పీపీ, అకాలీదళ్‌, అన్నాడీఎంకే, బీజేడీ, శివసేన

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *