డిల్లీ:సాయుధ దళాల్లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం వైరి వర్గాలపై పోరుకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధం కచ్చితంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలతోనే జరుగుతుందని.. అలాంటి పోరులో భారత్ తప్పకుండా గెలిచి తీరుతుందని రావత్ ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలో మంగళవారం జరిగిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) డైరెక్టర్ల 41వ వార్షిక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ దళాలకు కావాల్సిన ఆధునిక సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతోందన్నారు. కృత్రిమ మేధ, సైబర్, అంతరిక్ష, లేజర్, ఎలక్ట్రానిక్, రోబోటిక్ సాంకేతికతలో ఇంకా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సాయుధ దళాల అవసరాలకు స్వదేశీ పరిజ్ఞానంతో పరిష్కారాలు చూపేందుకు డీఆర్డీవో చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
అనంతరం అజిత్ డొభాల్ మాట్లాడుతూ.. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలను బలంగా అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన దేశాలు ఎప్పటికీ ముందుంటాయని.. అలాంటి దేశాలే మానవ సమాజానికి ఎంతో మేలు చేయగలిగాయన్నారు. ఈ విషయంలో భారత కాస్త వెనకబడే ఉందని విచారం వ్యక్తం చేశారు. డబ్బు, సాంకేతికతే భౌగోళిక రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ఈ రెండింట్లో సాంకేతికత మరింత కీలకమని డొభాల్ అభిప్రాయపడ్డారు.