Breaking News
Home / Crime / కన్న కొడుకే.. కాలయముడై..

కన్న కొడుకే.. కాలయముడై..

కన్న కొడుకే.. కాలయముడై..
మద్యానికి డబ్బులివ్వలేదని హత్య
రాయితో కొట్టి చంపిన వైనం
పోలీసుల అదుపులో నిందితుడు
నెల్లిమర్ల: అమ్మ గొప్పతనాన్ని వేనోళ్లా కీర్తించి.. మాతృమూర్తుల పాదాలకు అందరూ నమష్కరించి ఆశీర్వాదం పొందిన మాతృదినోత్సవం మరుసటిరోజే ఓ కొడుకు కని, పెంచిన తల్లి పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. మద్యానికి డబ్బులివ్వలేదని అత్యంత కర్కశంగా రాయితో మోదాడు. తనదగ్గర డబ్బుల్లేవని ప్రాధేయపడింది. అయినా వినకుండా రోడ్డుపై తరుముకుంటూ వెళ్లి జుట్టు పట్టుకుని, కింద పడేసి ఇటుక బెడ్డతో తలపై కొట్టాడు. అత్యంత కిరాతకంగా, ప్రాణం వదిలేదాకా కొట్టి చంపాడు. నెల్లిమర్ల మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సోమవారం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనను చూసిన వారంతా చలించిపోయారు. అమ్మ పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం దారుణమని కన్నీరు పెట్టారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లిమర్ల మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలో టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న జలుమూరి గౌరమ్మ (65)కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శ్రీను మద్యానికి బానిసయ్యాడు. పనికి వెళ్లకుండా తాగుడుకు డబ్బులకోసం నిత్యం తల్లిని వేధిస్తుండేవాడు. చిన్నకొడుకు ప్రవర్తనతో ఆ తల్లి నరకయాతన అనుభవించేది. ఇది చూస్తున్న స్థానికులు పద్ధతి కాదని, ఏదైనా పనికి వెళ్లి తల్లికి తోడుగా ఉండాలని సూచించేవారు. మంచి మాటలు చెప్పేవారిపైనా శ్రీను గొడవకు దిగేవాడు. దీంతో స్థానికులు పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తల్లి వద్దకు వచ్చి మద్యానికి డబ్బులడిగాడు. తన దగ్గర లేవని తల్లి గౌరమ్మ చెప్పింది. అయినా వినకుండా చంపేస్తానని బెదిరించాడు. అంతలోనే ఆగ్రహానికి గురై పక్కనే ఉన్న ఇటుకబెడ్డతో కొట్టాడు. దీంతో భయపడిన తల్లి పక్కనే ఉన్న పంపుహౌస్‌లోకి పరుగులు తీసింది. అయినా తరుముకొస్తుండడంతో కొంతదూరం వెళ్లిన తరువాత కిందపడిపోయింది. తనను చంపవద్దని కొడుకును వేడుకుంది. వినకుండా మృగాన్ని వేటాడి చంపినట్టు శ్రీను.. తల్లిని రాయితో తలపై పలుమార్లు మోది చంపాడు. విషయం తెలుసుకున్న విజయనగరం డీఏస్పీ సూర్యశ్రావన్‌ కుమార్‌, సీఐ ప్రభాకర్‌, ఏఎస్‌ అశోక్‌కుమార్‌ సంఘటా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అందరికి అమ్మగా ..గౌరమ్మ
గౌరమ్మ అంటే చుట్టుపక్కల వారికి ఎంతో అభిమానం. అందరికి అమ్మ గౌరమ్మ అనేవారు. గడిచిన 25 సంవత్సారాలుగా పంపుహౌస్‌ వద్దనే చిన్నపాటి టీకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నది. మండల కార్యాలయం పక్కనే ఉండటంతో ప్రజలు, ప్రజాపతినిధులు గౌరమ్మను అమ్మా అని పిలుస్తుంటారు. అందరి తలలో నాలుకలా ఉండే ఈమె డబ్బులు లేకుండా ఎవరైనా టిఫిన్‌, టీ..కోసం వచ్చినా తరువాత ఇవ్వండి..ముందు ఆకలి తీర్చుకోండి అంటూ అమ్మలా చూసేది. అలాంటి తల్లిని కొడుకే అత్యంత దారుణంగా చంపడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Check Also

కడుపునొప్పితో వస్తే ప్రాణమే పోయింది

Share this on WhatsAppఅపెండిసైటిస్‌ సర్జరీలో ఘోర తప్పిదం పేగు కత్తిరించడంతో ఆగని రక్తస్రావం ఆపరేషన్‌ టేబుల్‌పైనే మహిళ మృతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *