శ్రీనగర్: గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను, ఆయన కుమారుడు పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ను 15 మందితో కూడిన ఆ పార్టీ ప్రతినిధుల బృందం అబ్దుల్లా నివాసం వద్ద కలుసుకున్నారు. గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనుమతి పొందిన తరువాత వారికి కలుసుకునే అవకాశం లభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ సింగ్ రానా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఎలాంటి చర్చలు జరపరాదని ఆంక్షలు ఉన్నప్పటికీ రానున్న బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (బిడిసి) ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కశ్మీర్ ప్రత్యేకహోదా రద్దు చేసిన తరువాత నుంచి ఫరూక్ తోపాటు ఇతర రాజకీయ సీనియర్ నేతల నిర్బంధం కొనసాగించడంపై పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేంద్రం మాత్రం గృహ నిర్బంధంలో ఉన్న వారిని త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
