Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఎవరికీ అత్యధిక మెజారిటీ రాదనుకున్నారు.. కానీ…

ఎవరికీ అత్యధిక మెజారిటీ రాదనుకున్నారు.. కానీ…

– పశ్చిమలో ఎవరి పాచిక పారేనో!
– వరుసగా నాలుగోసారి త్రిముఖ పోరు
– కాంగ్రెస్‌ రెండుసార్లు, టీడీపీ ఒకసారి విజయం
– ఈసారి పోరు రసవత్తరం

గుంటూరు: ఒకప్పుడు అటు పల్లె, ఇటు పట్టణ ప్రాంతాలను కలుపుకొని ఉన్న ఈ నియోజకవర్గం 2009నుంచి పూర్తిగా నగర పరిధికి పరిమితం అయింది. గతంలో గుంటూరు రూరల్‌ మండలంలో ఎవరికి ఎక్కువగా పట్టు ఉంటే వారే విజేతలుగా నిలిచేవారు. ఒకవైపు సంపన్నులు, మరోవైపు సమాజంలో అట్టడుగు వర్గాలు నివసించే నియోజకవర్గంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలానే ప్రభుత్వ ఉద్యోగుల స్థిరనివాసాలు కూడా ఇక్కడే ఎక్కువ… అదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. రెండేసిసార్లు గెలిచిన నిశ్శంకరరావు వెంకటర్నతం, చదలవాడ జయరాంబాబు, చేబ్రోలు హనుమయ్య మూడోదఫా ఓటమి చవిచూడక తప్పలేదు. గత ఫలితాలను బేరీజు వేసుకొని చూస్తే ఈ నియోజకవర్గం ఏ పార్టీకి కంచుకోట కాదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, టీడీపీ చెరి నాలుగుసార్లు గెలుపొందాయి. ఈ దఫా మూడు ప్రధాన పార్టీల మధ్యన పోరు రసవత్తరంగా జరిగింది. ఓటరు దేవుడు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చాడో ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2,65,130 మంది ఓటు హక్కు కలిగి ఉండగా వారిలో పురుషులు 1,29,534, మహిళలు 1,35,551, థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 50 మంది ఉన్నారు. గత నెల 11న జరిగిన పోలింగ్‌లో 86,331 మంది పురుషులు, 87,808 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 1,74,147 కాగా 65.68 శాతంగా పోలింగ్‌ నమోదైంది. నల్లచెరువులోని 244వ నంబరు పోలింగ్‌ బూత్‌లో జరిగిన వివాదాస్పద కారణాలతో ఈ నెల మొదటి వారంలో రీపోలింగ్‌ నిర్వహించారు. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే 1,68,635 మంది ఓటుహక్కు వినియోగించుకోగా అప్పట్లో పోలింగ్‌ శాతం 65గా నమోదైంది. గతంలో కంటే ఈ దఫా 0.68 శాతం పోలింగ్‌ పెరిగింది.

2004 నుంచి పోరు రసవత్తరం
2004కు ముందువరకు పోటీ ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్‌ మధ్యన ఉండేది. 2004లో టీడీపీ తరపున టీవీ రావు పోటీచేస్తే రెబెల్‌ అభ్యర్థిగా చల్లా వెంకటకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. ఆయనకు రూరల్‌ మండలంలో పట్టు ఉండటంతో ఆ ఎన్నికల్లో 17 వేలకు పైగా ఓట్లను చీల్చగలిగారు. అది కాంగ్రెస్‌ అభ్యర్థి తాడిశెట్టి వెంకటరావుకు ప్లస్‌పాయింట్‌ అయింది. ఆ ఎన్నికల్లో వెంకటరావు 16వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009కి వచ్చేసరికి ప్రజారాజ్యం తరపున తులసి రామచంద్రప్రభు బరిలోకి దిగారు. టీడీపీ తరపున చుక్కపల్లి రమేష్‌, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిలిచారు. త్రిముఖ పోరులో టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యన నువ్వా… నేనా అన్నట్లుగా విజయం దోబూచులాడింది.

చివరి రౌండ్‌ కౌంటింగ్‌ జరిగిన తర్వాత సుమారు 2 వేల పైచిలుకు మెజార్టీతో కన్నా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ ముక్కోణపు పోటీనే జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైసీపీ నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీపడ్డారు. కాంగ్రెస్‌, వైసీపీ ఓట్లు చీల్చుకోవడంతో మోదుగుల గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. ఆ ఎన్నికల్లో మోదుగులకు 78,837, అప్పిరెడ్డికి 60,924, కన్నాకు 23,275 ఓట్లు వచ్చాయి. ఈ దఫా టీడీపీ నుంచి మద్దాళి గిరిధర్‌, వైసీపీ నుంచి చంద్రగిరి ఏసురత్నం, జనసేన నుంచి తోట చంద్రశేఖర్‌ పోటీ చేశారు. గిరిధర్‌ ప్రధానంగా టీడీపీకి అండగా ఉన్న సామాజికవర్గాల ఓట్లపై ఆశలు పెట్టుకొన్నారు. వైసీపీ మాత్రం పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలలో కొన్ని కులాల ఓటర్లని నమ్ముకొన్నది. జనసేన అభ్యర్థి చంద్రశేఖర్‌ తన సామాజికవర్గంతో పాటు విద్యావంతుల ఓట్లని నమ్ముకొన్నారు.

రీపోలింగ్‌ సందర్భంగా పెద్దఎత్తున ప్రలోభాలు
గత నెల 11న పోలింగ్‌ ముగిసిన తర్వాత బూత్‌ల వారీగా అభ్యర్థులు ఓటర్లు, పోలైన ఓట్ల సంఖ్యని ఏజెంట్ల ద్వారా తెప్పించుకొని గెలుపు అవకాశాలపై బేరీజు వేసుకొన్నారు. ఎవ్వరికి పెద్దగా మెజార్టీ రాకపోవచ్చనే అంచనాకు వచ్చారు. దాంతో ఈ నెల మొదటివారంలో జరిగిన రీపోలింగ్‌లోనూ డబ్బు విపరీతంగా పంచారు. ఓటరుకు రూ. 1,500, మహిళలకు చీర, పురుషులు చొక్కా, ప్యాంట్‌ పంచి పెట్టారు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే ప్రతీ ఒక్క ఓటు కీలకమేనని స్పష్టమవుతోంది. దీంతో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి గెలుపు మాదంటే మాది అని ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పందేలకు తటపటాయింపు
వైసీపీకి చెందిన ఒక నాయకుడు ఇటీవలే గుంటూరు పశ్చిమలోని ఒక క్లబ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. టీడీపీ అభ్యర్థి గెలవరని ఆ నాయకుడు వ్యాఖ్యానించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులంతా పందేనికి సై అన్నారు. రూ. 5 లక్షలు తెచ్చుకోండి పందెం కాసుకొందామని చెప్పారు. అయితే వైసీపీ నాయకుడు అది మొదలుకొని ఇప్పటివరకు ముందడుగు వేయలేదని అంటున్నారు.

Check Also

శివసేనలో చేరిన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్…

Share this on WhatsAppముంబై: మహరాష్ట్ర ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి శివసేన పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *