కరాచీ: శ్రీలంకతో వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్(105 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లు) శతకంతో మెరిశాడు. దీంతో శ్రీలంకపై 67 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో అజామ్ అరుదైన ఘనత అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 11 సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బాబర్ తాజాగా అధిగమించాడు. 11 సెంచరీలు చేసేందుకు విరాట్ 82 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. బాబర్ కేవలం 71 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. సౌతాఫ్రికా క్రికెటర్ హాషీమ్ ఆమ్లా అత్యంత వేగంగా కేవలం 64 ఇన్నింగ్స్‌ల్లోనే 11 సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో సౌతాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ 65 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. గత కొన్నేండ్లుగా బాబర్ పాక్ తరఫున నిలకడగా రాణిస్తూ ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు.
