వాషింగ్టన్: ఉగ్రవాదంపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా మరోసారి పునరుద్ఘాటించింది. తద్వారా భారత్‌తో శాంతి చర్చలకు ముందడుగు వేయాల్సిన బాధ్యత పాక్ పైనే ఉందని స్పష్టం చేశారు. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధమంటూ మరోసారి వ్యాఖ్యానించారు. అయితే ఇరు దేశాలు కోరితేనే అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆయన పాలక వర్గంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కశ్మీర్ విషయంలో భారత్ ఎవరి జోక్యం కోరుకోవడం లేదని గుర్తుచేశారు. ఉభయ దేశాల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగడానికి కావాల్సిన వాతావరణాన్ని నెలకొల్పేందుకు అమెరికా ఎప్పటికీ కృషి చేస్తుందన్నారు.
అలాగే గతంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల అర్ధాంతర ముగింపునకు కారణమైన సీమాంతర ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. కర్తార్‌పూర్ కారిడార్‌పై ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం స్వాగతించదగిందన్నారు. భారత్-పాక్ ప్రజల మధ్య సంబంధాల మెరుగుదలకు ఇలాంటి చర్యలు ఎంతో ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ విషయాలపై ట్రంప్ ఇరు దేశాల ప్రధానులతో పలు సార్లు చర్చలు జరిపారన్నారు.