చెన్నై: ప్రేమించిందన్న కోపంతో కన్న కూతురి ప్రాణాలు తీసేందుంకు తల్లిదండ్రులు ప్రయత్నించిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తేని జిల్లా చిన్నమనూర్ కి చెందిన రాజా (46). అతని భార్య కవిత (43). వీరికి 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె బీఏ చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థిని తన అక్క తరపు బంధువు ఒకరిని ప్రేమిస్తున్నట్టు తెలిసింది. దీనికి తల్లి దండ్రులు వ్యతిరేకించారు.
హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను బైకులో మర్కయన్కోట ముల్లై పెరియార్ వంతెన వద్దకు తీసుకు వెళ్లారు. చదువుకుంటున్న సమయంలో ప్రేమ వ్యవహారాలు ఎందుకంటూ కుమార్తెకు నచ్చజెప్పారు. అయినా వినకపోవడంతో రాజా కుమార్తెపై దాడి చేసి ముల్లై పెరియార్ నదిలో తోసి అక్కడి నుంచి పారిపోయారు. నీటిలో పడిన ఆమె కాపాడాలంటూ కేకలు వేయడంతో ఆ మార్గంలో వెళ్తున్న ఆటో డ్రైవర్లు ఆమెను రక్షించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థిని తల్లిదండ్రులు రాజా, కవితను అరెస్టు చేశారు.